బోనం ఎత్తితే 400.. డ్యాన్స్ చేస్తే బీర్ బాటిల్

బోనం ఎత్తితే 400..  డ్యాన్స్ చేస్తే బీర్ బాటిల్

నాగర్ కర్నూల్, వెలుగు:  హారతి పడితే రూ.400.. బోనం పడితే రూ.400.. బతుకమ్మను తీసుకొస్తే రూ.300.. డ్యాన్స్ చేస్తే బీర్ బాటిల్ ఇస్తారహో” అంటూ నాగర్ కర్నూల్‌‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేసే గ్రామాల్లో చాటింపులు వేయిస్తున్నారు. జనాలను రప్పించేందుకు ఆయా గ్రామాల్లో ముందురోజు ఈ మేరకు డప్పులు కొడుతూ చాటింపు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగర్‌‌‌‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ కావడంతో.. పదేండ్ల ప్రజా ప్రస్థానం పేరుతో వారం రోజులుగా గ్రామాల్లో మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. తెల్కపల్లి మండలం నుంచి పాదయాత్ర ప్రారంభించిన మర్రి జనార్దన్ రెడ్డి బుధవారం బొప్పల్లి, లక్నారం గ్రామాల్లో పర్యటించారు. 

ఈ నేపథ్యంలో ఆయన వెళ్లడానికి ముందురోజు ‘‘మన ఊరికి ఎమ్మెల్యే వస్తున్నడు.. ఆడోళ్లు బోనాలు తీసుకుని గుడికాడికి రావాలే. బతుకమ్మలు తేవాలే’’ అని చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా.. హారతి పడితే ఇంత, బోనానికి ఇంత, బతుకమ్మకు ఇంత.. ఊరేగింపు ముందు డాన్స్ చేసే యూత్‌‌కు బీర్ బాటిల్ అని ప్రకటిస్తున్నారు. మరోవైపు వర్షాభావంతో పనులు లేక ఇబ్బంది పడుతున్న వ్యవసాయ కూలీలు.. ఈ ర్యాలీలకు వెళ్తున్నారు. ‘‘ఎవరైతే మాకేంది.. పొలం పనులు దొరుకుతలేవు.. ఇట్లనన్న కూలి గిడుతుంది’’ అని అంటున్నారు. ఎన్నికల సందడి మొదలుకావడంతో గిరాకీ మస్తు పెరిగిందని బెల్ట్ షాపుల ఓనర్లు   సంబురపడుతున్నారు.