ఆకట్టుకున్న డ్రమ్స్​ ప్లేయర్​ శివమణి

ఆకట్టుకున్న డ్రమ్స్​ ప్లేయర్​ శివమణి
  • ఘనంగా రామప్ప వైభవం
  • ఆకట్టుకున్న డ్రమ్స్​ ప్లేయర్​ శివమణి
  • పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు 

వెంకటాపూర్ (రామప్ప), ములుగు : జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా ఆదివారం వెంకటాపూర్ మండలం రామప్ప ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో రామప్ప వైభవం పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, రెడ్ కో చైర్మన్ సతీశ్​రెడ్డి, రాష్ట్ర జల వనరుల మండలి చైర్మన్ వి.ప్రకాశ్​, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ప్రొఫెసర్ పాండురంగారావు హాజరయ్యారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ యునెస్కో గుర్తింపు తర్వాత సీఎం ఆదేశాల మేరకు రోడ్ల పునరుద్ధరణ, నిర్మాణానికి  రూ.11 కోట్లు ఖర్చు చేశామన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వెనక ప్రొఫెసర్ పాండురంగారావు కృషి ఉందన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. రామప్ప ఆలయం పరిసర ప్రాంతాల అభివృద్ధి పనుల కోసం రూ.36 కోట్లను మంజూరు చేసుకున్నామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా డ్రమ్స్​ప్లేయర్ శివమణి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీనికి మంత్రులు, ప్రజాప్రతినిధులు డ్యాన్సులు చేశారు. ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఐటీడీఏ పీవో అంకిత్, ఓఎస్​డీ గౌస్ ఆలం, ఏఎస్పీలు సుధీర్ రామ్నాథ్ కేకన్, అశోక్ కుమార్, జడ్పీటీసీ రుద్రమదేవి, ఎంపీపీ బుర్ర రజిత, సర్పంచ్ డోలి రజిత, టూరిజం మేనేజర్ కుసుమ సూర్య కిరణ్ పాల్గొన్నారు. కాగా, ముగింపు వేడుకలకు వర్షం అంతరాయం కలిగించింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన షో వర్షంతో 8 గంటలకు మొదలైంది. మంత్రులు మాట్లాడిన తర్వాత లేజర్ షో నిర్వహించాల్సి ఉండగా భారీ వర్షం పడడంతో నిలిపేశారు.