జూబ్లీహిల్స్ , వెలుగు: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్న ప్రాంతాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో పాల్గొని సిబ్బంది పనితీరును పరిశీలించారు.
అనంతరం డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా 'స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్' నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో 7 ప్లాటూన్ల అదనపు బలగాలతో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వాహనదారులందరూ క్షేమంగా వారి గమ్యాలకు చేరుకోవాలన్నదే తమ లక్ష్యం అన్నారు. అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి శిక్ష తప్పదు అన్నారు. చట్ట ప్రకారం వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు, 10, 000 ఫైన్, జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.
