హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే డీఎస్సీకి రోజురోజుకూ దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నెల 4న దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, శుక్రవారం రాత్రి వరకు అన్ని పోస్టులకు కలిపి 6,011 అప్లికేషన్లు అందాయి. మొత్తంగా 6,900 మంది ఫీజు చెల్లించారు. శుక్రవారం ఒక్కరోజే1,100 మంది దరఖాస్తు చేశారు. కాగా, ఇప్పటికే డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకున్న 1.77 లక్షల మంది మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. దీంతో కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు. పోస్టులు భారీగా పెరగడం, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో మరో లక్షన్నర మంది అప్లై చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
