హైదరాబాద్, వెలుగు: డిగ్రీలో మార్కులు తక్కువుండి డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 2011కు ముందు డిగ్రీ పాసైన అభ్యర్థులు మార్కులతో సంబంధం లేకుండా డీఎస్సీకి అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. ఆ తర్వాత పాసైన అభ్యర్థులకు డీఎస్సీ క్వాలిఫైయింగ్ మార్కుల శాతాన్ని తగ్గించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో నంబర్ 14ను రిలీజ్ చేశారు. గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో తెలిపిన మార్కుల శాతానికి సవరణలు చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు.
గతంలో డీఎస్సీ నోటిఫికేషన్లో డిగ్రీలో ఓసీలకు 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులుంటే అర్హులుగా ఉండేది. దీనిపై కొందరు అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మార్కుల శాతాల్లో మార్పులు చేస్తూ ఎన్సీటీఈ గెజిట్ జారీచేసింది. 2011 జులై 29 కంటే ముందు పాసైన వారందరికీ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులుగా ఉంటారని దాంట్లో పేర్కొన్నది. ఆ తర్వాత పాసైన వారికి ఓసీలకు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులకు 40% మార్కులుంటే సరిపోతుందని మరో ఉత్తర్వులో స్పష్టత ఇచ్చింది.
అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్సీటీఈ ఉత్తర్వులు పట్టించుకోకుండా.. పాత పద్ధతిలోనే మార్కుల అర్హతను పెట్టి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, గత సర్కారు ఇచ్చిన పోస్టులను డబుల్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం 11వేల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హతలన్నీ పాతవే ఉండడంతో, తాజాగా మార్పులు చేశారు. ఎన్సీటీఈ ఉత్తర్వుల ప్రకారం మార్కుల అర్హత శాతాన్ని తగ్గిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కాగా, ఈనెల 20 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులున్న అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.