రోడ్లపై గొడవలకు దిగితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం : డీఎస్పీ రాజశేఖర రాజు 

రోడ్లపై గొడవలకు దిగితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం : డీఎస్పీ రాజశేఖర రాజు 

మిర్యాలగూడ, వెలుగు : ఎవరైనా రోడ్లపై గొడవలకు దిగితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. మంగళవారం డీఎస్పీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిషేధిత గంజాయి, గుట్కాను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆకతాయిల గొడవలపై ఇటీవల మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటికే రౌడీ షీటర్లుగా ఉన్న వారు ఘర్షణలకు దిగితే పీడీ యాక్ట్​నమోదు చేస్తామన్నారు. మిర్యాలగూడ పట్టణంలో వాహనదారులు, చిరు వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

షాపుల మూసివేతకు రాత్రి 11 గంటల వరకే డెడ్ లైన్  విధించామని,  వైద్యసేవలు మినహా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్ కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో మిర్యాలగూడ పట్టణ, రూరల్ సర్కిల్ సీఐలు నాగార్జున, సుధాకర్, వీరబాబు, ఎస్ఐలు శ్రీనివాస్ నాయక్, నరేశ్, శేఖర్, బండి మోహన్ యాదవ్, రవికుమార్, శోభన్ బాబు పాల్గొన్నారు.