ఢిల్లీలో పీవీ విగ్రహం..తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటుకు డీయూఏసీ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీలో పీవీ విగ్రహం..తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటుకు డీయూఏసీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబసభ్యులు రాసిన లేఖపై పదేండ్ల తర్వాత కదలిక వచ్చింది. ఢిల్లీలో పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2013లో పీవీ కుమారుడు ప్రభాకర్ రావు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ)కు లేఖ రాశారు. 

ఢిల్లీలోని ఏపీ/తెలంగాణ భవన్ ప్రాంగణంలోని ఏపీ తొలి సీఎం టంగుటూరి ప్రకాశం విగ్రహం పక్కనే పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని ‘పీవీ మెమోరియల్ ఫౌండేషన్’ ద్వారా రాసిన లేఖలో కోరారు. అయితే ఇటీవల పీవీ విగ్రహ ఏర్పాటుపై ఎన్డీఎంసీ ప్రతిపాదన చేయగా, ఈ ఏడాది మార్చి 27న ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్(డీయూఏసీ) ఆమోదం తెలిపినట్టు తెలిసింది. 

కాగా, ప్రస్తుతం ఉమ్మడి భవన్ ఆస్తులను ఏపీ, తెలంగాణ భవన్‌‌లు పంచుకోవడంతో పాటు త్వరలో రెండు రాష్ట్రాలు కొత్త భవన్‌‌లు నిర్మించుకునే పనిలో బిజీలో ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ భవన్ డిజైన్ ఫైల్ కాగా... త్వరలో టెండర్లు కూడా పిలవనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్తగా నిర్మించే భవన్‌‌లో పీవీ విగ్రహం ఏర్పాటు చేస్తారా? లేక టంగుటూరి ప్రకాశం విగ్రహం పక్కనే పెడతారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.