దుబాయ్‌‌ అపార్ట్​మెంట్​లో మంటలు.. నలుగురు ఇండియన్స్​ సహా 16 మంది మృతి

దుబాయ్‌‌ అపార్ట్​మెంట్​లో మంటలు.. నలుగురు ఇండియన్స్​ సహా 16 మంది మృతి

దుబాయ్: దుబాయ్‌‌లోని రెసిడెన్షియల్ బిల్డింగ్‌‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ఇండియన్లు సహా 16 మంది చనిపోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అల్ రాస్ ఏరియాలోని బిల్డింగ్‌‌ నాలుగో ఫ్లోర్‌‌‌‌లో తొలుత మంటలు చెలరేగాయని, తర్వాత మిగతా ఫ్లోర్లకు ఎగబాకాయని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.35 సమయంలో మంటలు చెలరేగినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్  ఆపరేషన్స్ రూమ్‌‌కు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న డిఫెన్స్ టీమ్.. బిల్డింగ్‌‌లో ఉన్న వారిని బయటికి తరలించింది.

మధ్యాహ్నం 2.42 సమయంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 3 గంటల ప్రాంతంలో.. క్రేన్ ద్వారా మూడో ఫ్లోర్‌‌‌‌లో ఉన్న వారిని కిందికి తీసుకొచ్చారు. ‘‘ఇండియాకు చెందిన రిజేశ్ కలంగదన్ (38), ఆయన భార్య జేషి (32), గుడు సలియాకూందు (49), ఇమామ్‌‌ ఖాసీమ్‌‌ అబ్దుల్ ఖాదీర్ (43) ఈ ప్రమాదంలో చనిపోయారు. వారి పాస్‌‌పోర్ట్ కాపీలను ఇండియన్ సోషల్ వర్కర్ నజీర్ వటనపల్లి ద్వారా అందుకున్నాం. స్థానిక అధికారుల సహకారంతో డెడ్‌‌బాడీలను స్వదేశానికి పంపేందుకు అవసరమైన ప్రోసీజర్లను చూస్తున్నాం” అని దుబాయ్‌‌లోని ఇండియన్ కాన్సులేట్ కాన్సులర్  బిజేందర్ సింగ్ వివరించారు.