అరుదైన ఘనత సాధించిన దుబాయ్

అరుదైన ఘనత సాధించిన దుబాయ్

దుబాయ్ నగరం అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో మొట్టమొదటి 100 శాతం పేపర్ లెస్ గవర్నమెంట్ గా ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలు, లావాదేవీలను డిజిటల్ ఫార్మాట్ లో అందుబాటులోకి తెచ్చి ఈ ఘనత దక్కించుకుంది. ఈ మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షఏక్ హమ్ దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటన చేశారు. పేపర్ లెస్ గా మారడం వల్ల 14 మిలియన్ గంటల శ్రమను, 1.3 బిలియన్ దిర్హామ్ డబ్బును ఆదా చేసినట్లు స్పష్టం చేశారు. 100శాతం పేపర్ లెస్ గా మారిన దుబాయ్ డిజిటల్ క్యాపిటల్ గా ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచిందని క్రౌన్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు. 

దుబాయ్ ప్రభుత్వం పేపర్ లెస్ వ్యూహాన్ని ఐదు దశల్లో అమలు చేసింది. 100శాతం పేపర్ లెస్  లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల లావాదేవీలు, సేవలను సేవ డిజిటల్ పద్దతిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 45 ప్రభుత్వ రంగ సంస్థలు 1800 రకాల సేవలను డిజిటల్ ఫార్మాట్లో ప్రజలకు అందించారు. సేవలు అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పేపర్ లెస్ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రభుత్వం నగరవాసులపై ఎలాంటి ఒత్తిడి చేయకపోవడం విశేషం. 

డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ లో భాగంగా దుబాయ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దుబాయ్ నౌ యాప్ ద్వారా 12 కేటగిరీలకు సంబంధించి 130 రకాల స్మార్ట్ సిటీ సర్వీసుల్ని నగర వాసులకు అందుబాటులోకి  తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా, యూకే, యూరప్ దేశాలు ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని భావించాయి. అయితే సైబర్ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ దుబాయ్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసింది. అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.