బాల రాముడిపై దుబ్బాక చేనేత వస్త్రం

బాల రాముడిపై దుబ్బాక చేనేత వస్త్రం

దుబ్బాక, వెలుగు : అయోధ్య బాల రాముడి కోసం దుబ్బాకలో తయారు చేసిన వస్ర్తం మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దుబ్బాక హ్యాండ్లూమ్ ​కంపెనీలోని లెనిన్​ఇక్కత్​(చేనేత) పింక్ ​కలర్​వస్ర్తానికి మంచి పేరుంది. దీంతో అయోధ్యలోని బాల రాముడి అలంకరణ కోసం ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్ మనీశ్ త్రిపాఠి దుబ్బాక కంపెనీలోని లెనిన్​ఇక్కత్​వస్ర్తాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ బోడ శ్రీనివాస్ ​తెలిపారు.

ఇప్పటికే రెండు కలర్లతో వస్ర్తాలను అందజేశామని..ఇందులో ప్రతి ఆదివారం బాల రాముడికి అలంకరించేందుకు పింక్ కలర్​ వస్ర్తాన్ని సెలెక్ట్  చేశారని చెప్పారు. అంతేగాకుండా ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు రాముడిని అలంకరించే లెనిన్, ఇక్కత్​ వస్ర్తాలను దుబ్బాకలోనే తయారు చేస్తున్నట్లు చెప్పారు. బాల రాముడికి దుబ్బాక చేనేత వస్ర్తాలు అందించడం తమకెంతో ఆనందాన్నిస్తోందన్నారు.

కేంద్ర చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో ఢిల్లీలో నిర్వహించిన చేనేత చీరల ప్రదర్శనలో కూడా దుబ్బాకలో తయారైన లెనిన్​ చీరకు, చేనేత కార్మికులకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు.