ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నరు

ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నరు

గద్వాల, కామారెడ్డి , వెలుగు:  ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలంటూ ఆందోళనలు హోరెత్తాయి, కామారెడ్డిలో బీజేపీ, గద్వాలలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. గద్వాల కాంగ్రెస్​ లీడర్లు చేపట్టిన కలెక్టరేట్​ ముట్టడి ఉద్రిక్తంగా   మారింది. పోలీసుల దాడిలో డీసీసీ ప్రెసిడెంట్​కు గాయాలు కాగా మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ   కార్యదర్శి  సంపత్​ కుమార్​తో పాటు కాంగ్రెస్​ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. ధరణి సమస్యలు పరిష్కరించాలంటూ   శుక్రవారం కాంగ్రెస్  ఆధ్వర్యంలో గద్వాల  కలెక్టరేట్ ముట్టడి  చేపట్టారు.  పోలీసులు అడ్డుకోగా వారి  కన్నుగప్పి  కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు  చేరుకున్నారు.  పోలీసులను తప్పించుకొని వెళ్లే క్రమంలో   తోపులాట జరిగింది. ఈ ఘటనలో డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి కిందపడి..  చేయి విరగగా హాస్పిటల్ కి తరలించారు. సంపత్ కుమార్ తోపాటు  కొందరు కార్యకర్తలు కాంపౌండ్ వాల్ దూకి కలెక్టరేట్ వద్దకు చేరుకోగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.   జోగులాంబ గద్వాల జిల్లాలో ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను  వారం రోజుల్లో పరిష్కరించాలని కోరినా ఫలితం లేదని సంపత్ కుమార్ విమర్శించారు.అధికారుల తీరుకు  నిరసనగా కలెక్టరేట్ ముట్టడికి వస్తే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.  ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయం జరిగే వరకూ  పోరాటం చేస్తామన్నారు.  లోకేశ్​ అనే యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసినా  ఆయన సమస్య కూడా తీరలేదన్నారు.  ఆతర్వాత కలెక్టరేట్​ లోకి కార్యకర్తలు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని   అరెస్టు చేసి గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు వీరు బాబు, నారాయణరెడ్డి, ఉమాదేవి  పాల్గొన్నారు.

కామారెడ్డిలోనూ..  

ధరణితో  రైతులు ఎదుర్కొంటున్న  సమస్యలు పరిష్కరించాలని, భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ   బీజేపీ ఆధ్వర్యంలో మూడు రోజుల కింద కామారెడ్డిలో నిరసన దీక్షలు చేపట్టారు.   నియోజకవర్గ ఇన్ చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో  అంబేద్కర్​ విగ్రహం వద్ద ఈ దీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కలెక్టర్​ స్పందించలేదని, అధికారుల తీరుకు నిరసనగా శనివారం నుంచి  రిలే నిరాహార దీక్షలు చేస్తామని వెంటకరమణా రెడ్డి ప్రకటించారు. ధరణి పోర్టర్​లో సమస్యల పరిష్కారం కోసం  ఒక్కో మండలంలో వందలాది అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయని ఆరోపించారు.   ధరణి పోర్టల్​లో సరైన   అప్షన్లు లేక  చిన్నచిన్న  సమస్యలు కూడా  పరిష్కారం కావడంలేదన్నారు.    మరో 3 రోజుల్లో కలెక్టర్​ స్పందించకపోతే   ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు.  పార్టీ జిల్లా జనరల్​ సెక్రెటరీ తేలు శ్రీనివాస్​,   వైస్​ ప్రెసిడెంట్​ వెంకటరెడ్డి,   టౌన్​ ప్రెసిడెంట్​ విపుల్​, మున్సిపల్ ఫ్లోర్​ లీడర్​ మోటూరి శ్రీకాంత్​, కౌన్సిలర్లు సుజిత, మానస, శ్రీనివాస్​, రవి, నరేందర్​, ప్రవీణ్​​,  లీడర్లు సురేశ్​, గంగారెడ్డి,  శ్రీనివాస్​, సంతోష్​రెడ్డి, నరేందర్​రెడ్డి, భూపాల్,   లింగం, నరేశ్​, శ్రీధర్​తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.