అడ్డా కూలీలు ఆగం!.. వరుస వానలతో దొరకని పనులు

అడ్డా కూలీలు ఆగం!.. వరుస వానలతో దొరకని పనులు
  • భారంగా మారిన కుటుంబపోషణ
  • వర్షంలోనే అడ్డాల వద్ద ఎదురుచూపు 
  • పిలిచేవారు లేక పొద్దంతా పడిగాపులు
  • ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి 
  • పలువురు అడ్డా కూలీలు వేడుకోలు

సికింద్రాబాద్, వెలుగు: సిటీలో వరుస వానలతో పనులు దొరకక అడ్డాకూలీల బతుకులు ఆగమాగంగా మారాయి. ఏ పనిదొరికినా.. ఎంత కూలి ఇచ్చినా చేద్దామని కూలీలు వచ్చి అడ్డావద్ద నిల్చొని ఉంటుండగా ఎవరూ వారిని పనులకు పిలవడంలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూసి ఉట్టి చేతులతో తిరిగి వెళ్తున్నారు. రెక్కాడితే డొక్కాడే బడుగు జీవులకు పనులు దొరక్కపోతుండగా కుటుంబమం తా పస్తులు ఉండే పరిస్థితులు నెలకొన్నాయి.  

వర్షాలతో పనులు దొరకడం లేదని కొందరు ఇండ్ల నుం చి బయటకు రావడంలేదు. మరికొందరు ఏదై నా పనిదొరుకుతుందేమోనని వర్షంలోనూ అడ్డాల వద్దకు వచ్చి పనుల కోసం ఎదురుచూస్తున్నా ఫలితం ఉండడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లేబర్ కార్డులు కలిగిన కార్మికులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కూలీలు కోరుతున్నారు. 

150  అడ్డాలు..5 లక్షల మంది 

సొంతూళ్లలో పనులు లేక కుటుంబాలతో నగరానికి వలసవచ్చి  భవన నిర్మాణాలు, ఇతరత్రా రోజు వారి పనుల చేసుకుని కూలీలు బతుకుతుంటారు. సిటీలో 150 అడ్డాలు ఉండగా.. కూలీలు సుమారు 5 లక్షల వరకు ఉంటారని కార్మిక సంఘాల ద్వారా తెలుస్తుంది. టోలీ చౌక్ లోని లేబర్​ అడ్డా అతిపెద్దది. ఇక్కడ రోజూ సుమారు 5 నుంచి 6 వేల మంది కార్మికులు అడ్డామీద పనుల కోసం ఎదురు చూస్తుంటారు. కూకట్​పల్లి, తార్నాక, తుకారాంగేట్​, బేగంపేట, సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​, ఉప్పల్, ముషీరాబాద్​, చిక్కడ పల్లి, వారాసిగూడ, రసూల్​పురా, బోయిన్​పల్లి అడ్డాల వద్దకు 200 నుంచి వేయి మంది వరకు కార్మికులు వస్తుంటారు. 

మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉంటారు. ఏ రోజు పని ఆరోజు వెతుక్కోవడమే. అడ్డాల వద్ద వారికి ఎలాంటి సదుపాయాలు లేవు. రోడ్డుపక్కన ఫుట్​పాత్​లపై వేచి చూస్తుంటారు. పనుల కోసం అడ్డా వద్దకు వచ్చే కార్మికులను మేస్త్రీలు, గుత్తేదార్లు కూలీ రేట్లు మాట్లాడుకుని తీసుకెళ్తుంటారు. రోజూ అందరికీ పనులు దొరకవు. పనుల దొరకని వారు  సాయంత్రం వరకు ఎదురు చూసి ఇంటికి వెళ్తారు. రోజుకు రూ.800 నుంచి వెయ్యి వరకు  కూలీ వస్తుంది. సాధారణ రోజుల్లో  వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు కూడా పనులు దొరుకుడు కష్టంగా ఉంటుంది. వర్షాలతో నాలుగు రోజులుగా భవన నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

ఇండ్లలోనే ఉంటున్నాం

వారం రోజులుగా పనులు దొరుకుత లేవు.  వర్షంలోనూ అడ్డాకు వెళ్లినా ఎలాంటి చిన్న పనులకు కూడా పిలవడం లేదు. పనులు దొరుకుత లేవని ఇండ్లలోనే ఉంటున్నాం. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మూడు రోజులు వాన ఉంటుందంటుంగా..పస్తులు ఉండే పరిస్థితులు వచ్చేట్టు ఉంది. 

- వెంకన్న, భవన నిర్మాణ కూలీ, తార్నాక లేబర్​ అడ్డా

పనులు దొరుకుత లేవు

కూలీ చేస్తేనే కుటుంబం గడుస్తుంది. లేదంటే పస్తులు ఉండడమే. వానలు పడుతుండగా ఏదైనా పనిదొరుకుతుందోమోనని అడ్డా వద్దకు వచ్చా. ఆరు రోజులుగా పనిలేదు. పొద్దున  వచ్చి సాయంత్రం వరకు ఉండి పోతున్నా. పనులు లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది.  వర్షం ఇంకా ఎన్ని రోజులు ఉంటదో తెలియదు.
- కె. రాజు, కూలీ,  సికింద్రాబాద్​

ముఖ్యమంత్రి ఆదుకోవాలి

వర్షాలతో పనులు దొరకక డ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.  అప్పులు చేసి సరుకులు కొనుక్కుం టున్నాం.  కుటుంబ పోషణ చాలా కష్టంగా మారింది. లేబర్​గుర్తింపు కార్డులు ఉన్న కార్మికులను ముఖ్య మంత్రి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి. 
- వెంకటస్వామి, కూలీ, వారాసిగూడ