డైట్ బిల్లులు ఇస్తలేరు! ఉద్దెరకు సరుకులు తెస్తున్న వార్డెన్లు

డైట్ బిల్లులు ఇస్తలేరు! ఉద్దెరకు సరుకులు తెస్తున్న వార్డెన్లు
  •    రూ.లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు
  •   ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామంటున్న వార్డెన్లు
  •    స్టూడెంట్స్​కు అందని మెనూ

మెదక్/శివ్వంపేట, వెలుగు : ఏడాది కాలంగా డైట్ బిల్లులు రాక ఎస్టీ హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు భారంగా మారింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, చికెన్, గుడ్లు, పండ్లు గ్యాస్​కొనుగోలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎలాగోలా సరుకులు తెస్తున్నా నిర్దేశిత మెనూ ప్రకారం స్టూడెంట్స్​కు భోజనం పెట్టలేని పరిస్థితి నెలకొంది.

కొందరు వార్డెన్లు తమ జీతం డబ్బులతో సరుకులు కొంటుండగా, మరి కొందరు ఉద్దెరకు సరుకులు కొనుగోలు చేసి స్టూడెంట్స్​కు వండి పెడుతున్నారు. బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని తమ పరిస్థితి ‘కక్కలేక మింగలేక’ అన్నట్టు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  మూణ్నెళ్లకోసారి రావాలి...

ట్రైబల్​వెల్ఫేర్​డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎస్టీ హాస్టళ్లు, కాలేజీ స్టూడెంట్స్ కోసం పోస్ట్​మెట్రిక్​హాస్టళ్లతోపాటు, పలు ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఆయా హాస్టళ్లల్లో ఉండే స్టూడెంట్స్​కు నిర్దేశిత మెనూ ప్రకారం భోజనం పెట్టేందుకు ఒక్కొక్కరికి రోజుకు రూ.34 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.

స్టూడెంట్స్​కు ప్రతిరోజు పొద్దున, రాత్రికి భోజనంతోపాటు, వారానికి ఒక రోజు చికెన్, మూడు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు అరటి పండు ఇస్తారు. కాగా డైట్ కు సంబంధించిన బిల్లులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రావాల్సి ఉండగా దాదాపు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. 

జిల్లాలో ఇదీ పరిస్థితి...

మెదక్​జిల్లాలో ప్రీమెట్రిక్, పోస్ట్​మెట్రిక్​హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు కలిపి11ఉన్నాయి. వాటిల్లో 1,384 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. కాగా ఆయా హాస్టళ్లకు డైట్ బిల్లులు గతేడాది జులై నుంచి పెండింగ్​లోనే ఉన్నాయి. కొన్ని హాస్టళ్లకు ఆరు నెలలవి, మరికొన్నింటివి ఏడాది బిల్స్​రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టళ్లకు కలిపి డైట్​బిల్లులు దాదాపు రూ.30 లక్షలు ఉన్నాయి. శివ్వంపేటలోని ఎస్టీ హాస్టల్లో 180 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ హాస్టల్​కు నిత్యావసరాలను రూ.8 లక్షలు, కూరగాయలవి రూ.లక్ష, చికెన్​వి రూ.80 వేలు పెండింగ్ ఉన్నాయి. రామాయంపేటలోని ఎస్టీ హాస్టల్​కు పది నెలల డైట్ బిల్లు రాలేదు.

నెలకు రూ.లక్ష చొప్పున రూ.10 లక్షలు బకాయి పడ్డాయి. కౌడిపల్లి ఎస్టీ హాస్టల్లో 280 మంది స్టూడెంట్స్ ఉండగా, గతేడాది జులై నుంచి నేటికీ బిల్లులు రాలేదు. అన్నింటివి కలిపి మొత్తం రూ.5.80 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. చిన్నశంకరంపేట ఎస్టీ హాస్టల్లో 80మంది స్టూడెంట్స్​ఉండగా డైట్ బిల్లులు రూ.3లక్షలు పెండింగ్​ఉన్నాయి. వెల్దుర్తి, తూప్రాన్, నిజాంపేటలోని ఎస్టీ హాస్టల్​ 2నెలల డైట్ బిల్లులు పెండింగ్​ఉన్నాయి. 

బంగారం కుదువపెట్టి తెచ్చిన..

గతేడాది నుంచి డైట్​బిల్లులు రావడం లేదు. కొన్ని నెలలు జీతం నుంచి కట్టిన. ప్రతి నెల సగం జీతం సరుకులు, కూరగాయలు, చికెన్, గ్యాస్​కొనేందుకే ఖర్చవుతున్నయి. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. దాంతో బంగారం తాకట్టు పెట్టి రూ.2.50 లక్షలు అప్పు తెచ్చి హాస్టల్​స్టూడెంట్స్​కు భోజనం పెట్టేందుకు అవసరమైన సరుకులు కొన్న. 

- దర్శన్ నాయక్, శివ్వంపేట ఎస్టీ హాస్టల్ వార్డెన్​ 

ఆఫీసర్​ ఏమన్నారంటే...

జిల్లాలోని ఎస్టీ హాస్టల్​డైట్ బిల్లులు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. హాస్టళ్లకు ఆరు నెలల నుంచి ఏడాది బిల్లులు రావాల్సి ఉంది. కొంతమేర బిల్లులు ట్రెజరీలో పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్​రాగానే చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. 

-   విజయ లక్ష్మి, జిల్లా ఇన్​చార్జి ట్రైబల్​వెల్ఫేర్ ఆఫీసర్