టీఎస్​పీఎస్సీపై అభ్యర్థులకు నమ్మకం వస్తలే..పరీక్షల్లో తగ్గుతున్న హాజరు శాతం

టీఎస్​పీఎస్సీపై అభ్యర్థులకు నమ్మకం వస్తలే..పరీక్షల్లో తగ్గుతున్న హాజరు శాతం
  • గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు గతంలో 75%.. ఇప్పుడు 61% హాజరు 
  • ఏఈఈలో గతంలో 75%.. మొన్న 57% అటెండెన్స్  
  • మిగిలిన పరీక్షల్లోనూ హాజరు శాతం తక్కువే..  
  • పేపర్ల లీకేజీ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోని సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: పేపర్ల లీకేజీ తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ)పై అభ్యర్థుల్లో నమ్మకం కుదరడం లేదు. కమిషన్ పై అనుమానాలతో పరీక్షల్లో హాజరు శాతం తగ్గుతున్నది. లీకేజీల ఘటన తర్వాత టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్షలోనూ హాజరు శాతం భారీగా తగ్గింది. పేపర్ల లీకేజీ తర్వాత కమిషన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ కేసులో కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ పీఏ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ విభాగంలో పని చేసిన రాజశేఖర్ రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. 
(మొదటి పేజీ తరువాయి)
కానీ ప్రభుత్వం కమిషన్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఎగ్జామ్స్ నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్​ను నియమించి చేతులు దులుపుకున్నది. కమిషన్ ను రద్దు చేసి, కొత్తది ఏర్పాటు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. కనీసం అభ్యర్థుల్లో నమ్మకం కలిగించేలా ఒక్క పనీ చేయలేదు. దీంతో టీఎస్ పీఎస్సీపై అభ్యర్థులకు నమ్మకం కలగడం లేదనే విషయం పరీక్షల హాజరు శాతంతో స్పష్టంగా అర్థమవుతున్నది. 

రెండు పరీక్షల్లోనూ అంతే.. 

పేపర్ల లీకేజీతో ఇంతకుముందు నిర్వహించిన అసిస్టెంట్​ఎగ్జిక్యూటివ్​ఇంజనీర్ (ఏఈఈ), గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షలను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. ఈ రెండింటినీ ఇటీవల మళ్లీ నిర్వహిస్తే, హాజరు శాతం భారీగా తగ్గింది. 1,540 ఏఈఈ పోస్టుల భర్తీకి మొదట జనవరి 22న పరీక్ష జరిగింది. మొత్తం 81,148 మంది అప్లై చేయగా.. 61,279 (75.14%) మంది హాజరయ్యారు. అయితే పరీక్ష రద్దుతో మే 8,9,21,22 తేదీల్లో ఆన్​లైన్​లో మళ్లీ నిర్వహించారు. అప్పుడు కేవలం 54,039 (57.34%) మంది మాత్రమే హాజరయ్యారు. అంటే గతంతో పోలిస్తే ఏకంగా 17.8% అటెండెన్స్ తగ్గింది. ఇక గ్రూప్ 1లోనూ ఇట్లనే జరిగింది. మొదట పోయినేడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించారు.  దీనికి 3,80,082 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,86,051 (75%) మంది హాజరయ్యారు. అంటే 94,030 మంది అటెండ్ కాలేదు. తాజాగా మళ్లీ ఆదివారం నిర్వహించిన పరీక్షకు 2,33,248 (61.37%) మంది మాత్రమే హాజరయ్యారు. అంటే ఏకంగా 1,46,834 మంది గైర్హాజరయ్యారు. గతంలో జరిగిన పరీక్షతో పోలిస్తే ఏకంగా 52,803 మంది తగ్గారు.  

ఏ పరీక్షలో అటెండెన్స్ ఎంతంటే.. 

పేపర్ల లీకేజీ తర్వాత ఏఈఈ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు డ్రగ్ ఇన్ స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్ తదితర పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లోనూ హాజరు శాతం తక్కువే ఉంది. మే16న జరిగిన అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షకు 8,961 మంది అప్లై చేసుకోగా.. 6,519 (72.74%)  మంది హాజరయ్యారు. మే 17న జరిగిన లైబ్రేరియన్ ఎగ్జామ్ కు 4,790 మంది అప్లై చేసుకోగా..  2,650 (55.32%) మంది అటెండ్ అయ్యారు. మే 19న జరిగిన డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్ పరీక్షకు 17,789 మంది అప్లై చేసుకోగా..10,704 (60.17%) మంది అటెండ్ అయ్యారు.

ఇట్లయితే నమ్మకం ఎట్లుంటది?  

ఏకంగా కమిషన్ సెక్రటరీ పీఏనే లీకేజీలో ప్రధాన నిందితుడు. అతనితో పాటు కమిషన్​లో చాలామంది పలు పరీక్షలు రాస్తున్నా, ఆ విషయాన్ని ఆ అధికారి గుర్తించలేదు. అయినా ఆ అధికారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భవిష్యత్తులోనూ పరీక్షలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదు. కోచింగ్​లకు డబ్బులు వేస్ట్.   - రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఆవేదన