
బెంగళూరు: దులీప్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. టీమిండియా ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, శార్దూల్ ఠాకూర్‌లతో కూడిన వెస్ట్ జోన్.. సెంట్రల్ జోన్‌తో తలపడనుంది. ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి సారించాడు. ఫలితంగా స్వదేశంలో వెస్టిండీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రేసులో ఉండాలని భావిస్తున్నాడు.
పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌ల్లో 50.33 సగటుతో 175కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 604 రన్స్ చేసినా ఆసియా కప్‌లో చోటు లభించకపోవడంతో శ్రేయస్ కాస్త నిరాశకు లోనయ్యాడు. ఈ నిరాశను దులీప్ ట్రోఫీలో పరుగుల వర్షంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక జైస్వాల్.. టీమిండియా టెస్ట్ జట్టులో చోటును మరింత సుస్థిరం చేసుకునేందుకు ఈ టోర్నీని వేదికగా చేసుకోవాలని యోచిస్తున్నాడు.
చివరిసారి ఇంగ్లండ్‌పై ఐదో టెస్ట్ ఆడిన జైస్వాల్ ఆ తర్వాత మళ్లీ ఈ ఫార్మాట్‌లో బరిలోకి దిగలేదు. విండీస్‌తో సిరీస్ వరకు వేచి చూడకుండా దులీప్‌లోనే ఫామ్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తున్నాడు. వెస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శార్దూల్ ఠాకూర్ కూడా ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓ మోస్తరు ప్రదర్శనకే పరిమితమయ్యాడు. దాంతో మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని ప్లాన్స్ వేస్తున్నాడు.
యంగ్‌స్టర్స్ రుతురాజ్ గైక్వాడ్, తనుష్ కొటియాన్.. జాతీయ స్థాయిలోకి బలంగా తిరిగి రావాలని ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. కాగితంపై వెస్ట్ జోన్ బలంగా కనిపిస్తున్నా.. మైదానంలో ఎలా ఆడతారన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గజ్జల్లో గాయంతో ఇబ్బందిపడుతున్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కోలుకుంటే కెప్టెన్సీ చేపట్టే చాన్స్ ఉంది. లేదంటే స్టాండిన్ కెప్టెన్ రజత్ పటీదార్‌కు అవకాశం దక్కొచ్చు.
డానిష్ మాలేవర్, శుభమ్ శర్మ గత వారం సెంచరీలు చేయడంతో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే, పేసర్లు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్‌తో కూడిన సమర్థవంతమైన బౌలింగ్ యూనిట్ ఉండటం కలిసొచ్చే అంశం.
సౌత్ బలహీనంగా..
మరో సెమీస్‌లో సౌత్ జోన్.. నార్త్ జోన్‌తో తలపడనుంది. ఆసియా కప్ సన్నాహాల కోసం దుబాయ్ వెళ్లిన తిలక్ వర్మతో పాటు పేసర్ వైశాఖ్ విజయ్ కుమార్ గాయపడటం, లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిశోర్ లేకపోవడం సౌత్‌ను బలహీనంగా మార్చింది. కాబట్టి ఎన్. జగదీశన్, దేవదత్ పడిక్కల్, సల్మాన్ నిజార్‌పై ఎక్కువ భారం పడనుంది.
పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా లేకపోవడం నార్త్‌కు బౌలింగ్‌లో ఇబ్బందులు తప్పేలా లేవు. టీమిండియా పేసర్ అన్షుల్ కాంబోజ్ ఈ మ్యాచ్‌లో ఆడే చాన్స్ ఉంది. ఆయుష్ బదోనీ, అంకిత్ కుమార్, యష్ ధుల్ బ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం చాలా ఉంది.