డూప్లికేట్ పిస్టల్తో బెదిరింపు... మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్లో కలకలం

డూప్లికేట్  పిస్టల్తో బెదిరింపు... మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్లో కలకలం

మెదక్, వెలుగు: మెదక్  జిల్లా హవేలీ ఘనపూర్ లో డూప్లికేట్  పిస్టల్​తో చంపుతానని బెదిరించడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. హవేలీ ఘనపూర్​ సమీపంలో హైదరాబాద్ కు చెందిన నిల్సన్​కు అతని భార్య పుష్పమ్మ పేరు మీద ఐదెకరాల భూమి ఉంది. కాగా, హవేలి ఘనపూర్​కు చెందిన సిద్దమ్మ ఆ భూమిని ప్రభుత్వం తమకు అసైన్​మెంట్  కింద కేటాయించిందని చెబుతోంది. ఈ విషయమై చాలా ఏండ్లుగా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతుండగా, సిద్దమ్మ కోర్టుకు వెళ్లి ఇంజక్షన్​ ఆర్డర్​ తీసుకుంది. 

ఈక్రమంలో సిద్దమ్మ తమ్ముడు ఎల్లం గురువారం ఉదయం ఆ భూమి వద్దకు వెళ్లగా, నాగాపూర్  గ్రామానికి చెందిన కొందరు యువకులు అడ్డుకున్నారు. యోహాన్​ అనే వ్యక్తి తనను డూప్లికేట్  పిస్టల్​తో చంపుతానని బెదిరించినట్లు ఎల్లం పోలీసులకు సమాచారం అందించాడు. 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డూప్లికేట్  పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లంను బెదిరించిన యువకుడి వద్ద ఉన్నది పిస్టల్​ మాదిరిగా ఉండే లైటర్​  అని మెదక్  రూరల్  సీఐ జార్జి తెలిపారు. పిస్టల్​ మాదిరిగా ఉండే లైటర్​తో బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.