సీఎం టూర్ ఎఫెక్ట్.. భైంసాలో బస్సులు బంద్

సీఎం టూర్ ఎఫెక్ట్.. భైంసాలో బస్సులు బంద్

సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా పలు చోట్ల బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నిరసనలు వ్యక్తం చేయకుండా ముందస్తు అరెస్ట్ చేశారు. బస్సుల బంద్, అనధికారికంగా కొన్ని చోట్ల స్కూళ్లు కూడా బంద్ పెట్టినట్లు తెలుస్తోంది.   నిన్న మంచిప్ప రిజర్వాయర్ ముంపు గ్రామాల కమిటీ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కు తమ గోడు చెప్పుకుందామన్నా అడ్డుకుని అరెస్ట్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మంచిప్ప రీ డిజైన్ రద్దు చేసే వరకు ఉద్యమం ఆపబోమంటున్నారు. ప్రస్తుతం ముంపు గ్రామాలు పోలీస్ పహారాలో ఉన్నాయి. 

సీఎం టూర్ సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసాలో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. భైంసా నుంచి ప్రతి రోజు ఉదయం నుంచి నిజామాబాద్ కు   రెగ్యులర్ గా బస్సులు ఉంటాయి. అయితే సీఎం టూర్ ఉందని చెప్పి భైంసా నుంచి ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. సీఎం రాకతో నిజామాబాద్ కు బస్సులు రద్దు చేస్తున్నట్లు బస్టాండ్ లో నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ప్రైవేట్ వాహనదారులు అందినకాడికి గుంజుతున్నారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు పలు విద్యాసంస్థల బస్సులను వాడుకోనుండడంతో నిజామాబాద్ లో కొన్ని విద్యా సంస్థలకు అనధికారికంగా సెలవు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.