
మెదక్ టౌన్, వెలుగు: ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దసరా, దీపావళి సమయంలో కిలో ఉల్లి ధర రూ.30 ఉండగా ప్రస్తుతం రూ. 80కి చేరింది. గతంలో టమోట ధరతో హడలిపోయిన ప్రజలు ప్రస్తుతం ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్నారు. సోమవారం మెదక్ మార్కెట్లో పది కిలోల బస్తా తీసుకుంటే రూ.800 అంటే కిలోకు రూ.80 చొప్పున... విడిగా కొంటే రూ. 90 కిలో చొప్పున విక్రయిస్తున్నారు.
దీంతో చేసేదేమీ లేక ప్రజలు మరింత ధరలు పెరుగుతాయని 10 కిలోల బస్తాను కొనుగోలు చేస్తున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో చాలా మంది ఇండ్లలో ఉల్లిగడ్డల వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ధరల పెరుగుదలకు దిగుబడి తగ్గడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉల్లిపంటతో లాభం లేకపోవడంతో రైతులు వేరే పంటలను సాగు చేస్తున్నారు.