సీజన్స్ లో మన ఆరోగ్యం పాడవకుండా కాపాడుకున్నట్లే కుండీల్లో పెరిగే మొక్కల ఆరోగ్యం కూడా కాపాడుతూ ఉండాలి. అందులోనూ ఎక్కువగా వానలు పడుతున్న సమయంలో మరింత కేర్ అవసరం. లేదంటే మొక్కలు చచ్చిపోతాయి. అందుకే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
నాకాలంలో కుండీలు ఎక్కడబెడితే అక్కడ పెట్టకుండా సురక్షితమైన ప్రాంతంలోనే పెట్టాలి. వాననీరు పడే ప్రాంతంలో కుండీలను పెట్టకూడదు. ఒకవేళ పెట్టాల్సి వచ్చినా వాటిపై కవర్లు వేయడంగాని లేదంటే కుండీలోని మట్టిని అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. ఎందుకంటే వాన పడడంతో మట్టి అంతా ఒక పక్కకు వెళ్లిపోతుంది. దానివల్ల వానపడితే నేరుగా వేర్లకు తగులుతుంది. దీనివల్ల మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఒకపక్కకు వచ్చిన మట్టిని కుండీమొత్తం సర్దుతూ ఉండాలి.
చిన్న మొక్కలు వస్తే తీసేయడం మంచిది: వానాకాలంలో ఎక్కువగా చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు కుండీల్లోంచి తీసేస్తూ ఉండాలి. లేదంటే అసలైన మొక్కను పెరగనీయకుండా చేస్తాయి. ఒకవేళ చిన్న మొక్కలు కావాలనుకుంటే వాటిని వేరే కుండీలో పెట్టుకోవాలి.
క్రిమికీటకాలను తొలగించాలి: మాన్సూన్ టైంలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొక్కల ఆకుల్ని తినేస్తూ ఉంటాయి. వానపాములు తప్ప ఏ రకమైన పురుగులు, కీటకాలు వచ్చినా వెంటనే తీసేయడం మంచిది. దీనివల్ల మొక్కలు హెల్దీగా పెరుగుతాయి.
ఫంగతో చేటు: వానాకాలంలోనే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. అలాగే ఎక్కువగా మొక్కలు చచ్చిపోయే ఛాన్స్ కూడా ఈ కాలంలోనే
ఉంది. ఎందుకంటే మొక్కకు కావాల్సినంత నీరు మాత్రమే అవసరం. అది ఎక్కువైనా.. తక్కువైనా మొక్కలు చచ్చిపోతాయి. అందుకే మట్టి బాగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి.
చిన్న మొక్కలకు మరింత కేర్ : చిన్న మొక్కలు, తీగ మొక్కలను వానలు ఎక్కువగా పడుతుంటే బాగా కేర్ గా చూసుకోవాలి. వానతో పాటు ఒక్కోసారి గాలి కూడా విపరీతంగా వస్తుంది. దాంతో తీగలు పడిపోయి, డెలికేట్ గా ఉండే మొక్కలు వంగిపోతుంటాయి. వాటిని తరువాత సెట్ చేయడం చాలాకష్టం. కాబట్టి ముందే చిన్న చిన్న కర్రల సపోర్టుతో మొక్కలను గట్టిగా కట్టాలి. దానివల్ల గాలి, వానలను అవి తట్టుకుని నిలబడతాయి.
