ప్రధాని వెంట జగన్..​ ప్రగతిభవన్​లోనే  కేసీఆర్

ప్రధాని వెంట జగన్..​ ప్రగతిభవన్​లోనే  కేసీఆర్
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వేదికపై మోడీకి జగన్​ విజ్ఞప్తి
  • తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ
  • ఇక్కడ మాత్రం వామపక్షాలతో కలిసి టీఆర్​ఎస్​ నిరసనలు
  • వరుసగా నాలుగోసారి ప్రధాని టూర్​కు సీఎం గైర్హాజరు


హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి.. రెండు రాష్ట్రాల్లో భిన్నమైన అనుభవం ఎదురైంది. ఏపీలో అక్కడి సీఎం జగన్​ ఘనంగా స్వాగతం పలికి, బహిరంగ సభలో ప్రధానితో పాల్గొని, విభజన హామీలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా.. ఇక్కడ సీఎం కేసీఆర్​ మాత్రం ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు.  ఉదయం నుంచి మీటింగ్​లు, రివ్యూలు ఏమీ లేవని, ప్రగతి భవన్​లోనే కేసీఆర్​ రెస్ట్​లో ఉన్నట్లు టీఆర్​ఎస్ ​వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని కలిసి సమస్యలు వివరించే అవకాశం ఉన్నా కేసీఆర్ వినియోగించుకోలేదని, ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. 


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేయాలని, విశాఖకు రైల్వే జోన్​ కేటాయించాలని సభా వేదికపైనే మోడీకి ఏపీ సీఎం జగన్​ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ మళ్లీ తమ విజ్ఞప్తులను ప్రధానికి తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రంతో తమ బంధం రాజకీయాలకు అతీతమైనదని, తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా లేదని జగన్​ తెలిపారు. అయితే తెలంగాణలో అందుకు భిన్నంగా ప్రధాని మోడీ టూర్​కు వరుసగా నాలుగోసారి సీఎం కేసీఆర్​ గైర్హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం ఏపీ నుంచి ప్రధాని మోడీ రాష్ట్రానికి రాగా.. స్వాగతించాల్సిన సీఎం దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళిసై, సీఎస్​ సోమేశ్​ కుమార్, ప్రభుత్వం తరఫున  మంత్రి తలసాని శ్రీనివాస​యాదవ్​ స్వాగతం పలికారు.

వామపక్షాలతో కలిసి నిరసనలు

ఏపీలో ప్రధాని పర్యటనకు అక్కడి వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తే..  రాష్ట్రంలో  మాత్రం ‘ప్రధాని గో బ్యాక్’ అంటూ టీఆర్​ఎస్​ ప్రచారం చేయటం, అనుబంధ సంఘాలు, వామపక్షాలతో నిరసనలు చేయించడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఏడాది మే 26న ఐఎస్‌బీ 20వ కాన్వొకేషన్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు టీఆర్​ఎస్​ ఇదే తీరుగా  ఫ్లెక్సీల క్యాంపెయిన్​ చేసింది. జులైలో  హైదరాబాద్​లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పాల్గొనేందుకు వచ్చిన మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బోర్డులు, హోర్డింగులతో ప్రచారం చేపట్టింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోడీ హాజరయ్యారు. అప్పటినుంచే ప్రధాని టూర్​కు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు.