శ్రీశైలంలో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు

శ్రీశైలంలో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు

గ్రామోత్సవం రద్దు.. ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు

కర్నూలు: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈనెల 17 నుంచి దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 25 వ తేదీ వరకు జరగనున్న దసరా మహోత్సవాలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామోత్సవం రద్దు చేసి ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు జరిపించనున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం పరిపాలన భవనంలో ఈవో కె.ఎస్.రామారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, దేవస్థానం ఉద్యోగులకు దసరా దేవి శరన్నవరాత్రుల నిర్వహణ.. ఏర్పాట్లుపై  తగిన సూచనలు ఇచ్చారు. కైంకర్యాలన్నీ యధావిధిగా నిర్వహించాలని.. వేద పండితులు భౌతిక దూరం పాటిస్తూ కైంకర్యాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.  ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలతోపాటు.. రక రకాల పూలతో అలంకరిస్తారు. దసరా మహోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు స్వామివారి విశేష అర్చనలు అమ్మవారికి నవావరణపూజలు, రుద్రయాగం, చంఢీయాగం నిర్వహిస్తారు.

ఈనెల 17న ఉదయం ఉదయం 8.30 గంటలకు అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలవుతాయి. ప్రారంభ పూజలో వేద స్వస్తి, ఉత్సవ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణపూజ, దీక్సా సంకల్పం, అఖండ దీపస్థాపన, వాస్తు పూజ, మండపారాధన, చండీ కలశస్థాపనలు జరుగుతాయి.

9.30 గంటల నుండి స్వామి వారి ఆలయంలో యాగశాల ప్రవేశం, శివ సంకల్పం, గణపతి పూజ, అఖండ దీపస్థాపన, వాస్తు పూజ, రుద్ర కలశ స్థాపన జరుగుతాయి.

ఉత్సవాలలో ప్రతిరోజు శ్రీ స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రపారాయణలు, అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేష కుంకుమార్చనలు, సువాసినీ పూజ, కాళరాత్రి పూజ జరుగుతాయి. 25వ తేదీన ఆయుధ పూజ, సాయంత్రం శమీపూజ జరుగుతాయి.  యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథ స్నానంతో ముగుస్తాయి.

విశేష అలంకార సేవలు.. వాహన సేవలు

17.10.2020. శ్రీ అమ్మవారికి  శైలపుత్రి అలంకార…. భృంగివాహన సేవ.

18.10.2020. అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారం…. మయుర వాహన సేవ.

19.10.2020. అమ్మవారికి చంద్రఘంట అలంకారం….  రావణ వాహనసేవ.

20.10.2020.  అమ్మవారికి కూష్మాండ దుర్గ అలంకారం…. కైలాసవాహన సేవ.

21.10.2020. అమ్మవారికి స్కందమాత అలంకారం… శేషవాహన సేవ.

22.10.2020. అమ్మవారికి కాత్యాయని అలంకారం… హంసవాహన సేవ.

23.10.2020. అమ్మవారికి కాళరాత్రి అలంకారం… గజావాహన సేవ.

24.10.2020. అమ్మవారికి మహా గౌరి అలంకారం… నంది వాహన సేవ.

25.10.2020.  అమ్మవారికి ఉదయం సిద్దదాయిని అలంకారం…. అశ్వవాహన సేవ

25.10.2020. అమ్మవారికి సాయంత్రం భ్రమరాంబ దేవి నిజాలంకరణ అలంకారం.. నంది వాహన సేవ.