ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌తో పారిశ్రామిక విప్లవం..తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం: భట్టి విక్రమార్క

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌తో పారిశ్రామిక విప్లవం..తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం: భట్టి విక్రమార్క
  • ఫ్యూచర్ సిటీపై వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్న డిప్యూటీ సీఎం 

హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్)తో తెలంగాణలో పారిశ్రామిక విప్లవం రాబోతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌తో ఫార్మా, ఐటీ, గృహ నిర్మాణం, వ్యవసాయం, చేనేత వంటి అనేక కొత్త పారిశ్రామిక క్లస్టర్లు వస్తాయని తెలిపారు. ‘‘తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. ఇక్కడ నైపుణ్యమున్న కార్మికులు తక్కువ వేతనాలకే అందుబాటులో ఉన్నారు. మంచి వాతావరణం, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అంశాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. 

ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌‌‌‌ అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు” అని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌లో కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన సీఎఫ్‌‌‌‌వోల (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్‌‌‌‌) సదస్సులో భట్టి మాట్లాడారు. రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చామని తెలిపారు. 

అదే ప్రభుత్వ లక్ష్యం.. 

సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని భట్టి తెలిపారు. ప్రజలందరికీ ప్రయోజనాలు అందేలా పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ‘‘విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌‌‌‌ నిర్మిస్తున్నాం. ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో రూ. 200 కోట్లతో కడుతున్నాం. ఒకేసారి 100 పాఠశాలల పనులు మొదలుపెట్టాం.

 నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంచడానికి, డిజిటల్ విద్య అందించడానికి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం” అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సీఎఫ్‌‌‌‌వోల పాత్ర కేవలం అకౌంట్లు చూసుకోవడానికి మాత్రమే పరిమితం కాదని... వాళ్లిప్పుడు సంస్థల భవిష్యత్తును, దిశను నిర్దేశించే మార్గదర్శకులుగా మారారని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.