
- ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ ముందు డీవైఎఫ్ఐ ధర్నా
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ నోటిఫికేషన్లను ఇయ్యకుంటే త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీని ముట్టడిస్తామని డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) నేతలు హెచ్చరించారు. వెంటనే నోటిఫికేషన్లను ఇవ్వాలన్న డిమాండ్‌తో శుక్రవారం వాళ్లు టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన చేశారు. ర్యాలీగా వచ్చి టీఎస్పీఎస్సీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో టీఎస్పీఎస్సీ గేటు ముందు బైఠాయించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో ఉద్యమం చేసిన నిరుద్యోగ యువతకు నిరాశే ఎదురైందని డీవైఎఫ్ఐ ఆలిండియా వైస్‌ప్రెసిడెంట్ విజయ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ మండిపడ్డారు. మూడేండ్లసంది టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లను ఇవ్వడమే లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ.. రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చినా సర్కారు భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల చాలా మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్లను ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం.. ఎన్నికలయ్యాక వాటి గురించి అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని సర్కారు అమలు చేయాలని, యువత కోసం బడ్జెట్లో ఎక్కువ నిధులను కేటాయించాలని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.