పథకం ప్రవేశపెట్టినా సబ్సిడీని ప్రకటించని ప్రభుత్వం

పథకం ప్రవేశపెట్టినా సబ్సిడీని ప్రకటించని ప్రభుత్వం
  • జిల్లాలో స్కీమ్​ అమలు చేయని మున్సిపల్​ ఆఫీసర్లు
  • పథకం ప్రవేశపెట్టినా సబ్సిడీని ప్రకటించని ప్రభుత్వం
  • టార్గెట్లు లేక గాలికొదిలేసిన అధికారులు
  • ఆఫీసర్లు పట్టించుకోవాలని స్ట్రీట్ వెండర్స్ డిమాండ్

మహబూబ్​నగర్​, వెలుగు : మున్సిపాలిటీల్లోని స్ట్రీట్​ వెండర్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంట లేదు. ‘పీఎం స్వనిధి’ ద్వారా కేంద్ర ప్రభుత్వం​ నుంచి అందుతున్న లోన్లు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలాంటి లోన్లు, స్కీమ్​లు అమలు కావడం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని వీధివ్యాపారులకు ఈఎంఐల ద్వారా ఎలక్ర్టిక్​ ఆటోల స్కీమ్​ ప్రవేశ పెట్టినా..  అధికారుల నిర్లక్ష్యంతో ఆ స్కీమ్​ ఉందని కూడా వారికి తెలియడం లేదు. ఆఫీసర్లు స్కీమ్​పై అవగాహన కల్పించి ఎలక్ట్రిక్​ ఆటోలు ఇవ్వాలని స్ట్రీట్​వెండర్స్​ కోరుతున్నారు. 

మూడు మున్సిపాలిటీల్లో..
పాలమూరు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 14,781 మంది స్ట్రీట్​ వెండర్లు ఉండగా, అందులో పాలమూరులో 11,404 మంది, జడ్చర్ల 2,609, భూత్పూర్​768 మంది ఉన్నట్లు 2018లో మెప్మా ఆధ్వర్యంలో గుర్తించారు. వీరంతా మున్సిపాలిటీల్లో రోడ్ల పక్కన రేకుల డబ్బాలు వేసుకొని కటింగ్​షాపులు, చాయ్​ దుకాణాలు, కూరగాయలు, తోపుడు బండ్లపై పండ్లు, చిన్న పిల్లల బట్టలు అమ్ముకునే వారు. వీరు ఒకే చోట కాకుండా కాలనీలు, గ్రామాల్లో జరిగే వారాంతపు సంతల్లో తిరుగుతూ వస్తువులు అమ్ముకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2019లో బ్యాటరీలతో నడిచే ఎలక్ర్టిక్​ ఆటోలు ఇప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘మెప్మా’ మిషన్​ డైరెక్టర్​ ఆఫ్​ హైదరాబాద్​ నుంచి స్ర్టీట్​ వెండర్లకు ఎలక్ర్టికల్ ​ఆటోలపై అవగాహన కల్పించాలని ఉత్తర్వులు​ కూడా వచ్చాయి. కానీ, స్థానిక అధికారులు మాత్రం దీన్ని సీరియస్​గా ఇంప్లిమెంట్​ చేయలేదు. ఆర్డర్స్​ వచ్చిన తర్వాత ఒకటి, రెండు సార్లు మహబూబ్​నగర్​ మున్సిపాలిటీలో  కొందరు స్ర్టీట్​ వెండర్లకు అవగాహన కల్పించారు. ఓ కంపెనీకి చెందిన రెండు ఆటోలను తీసుకొచ్చి వాటి పని తీరు గురించి వివరించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలక్ర్టిక్​ ఆటోల ప్రస్తావనే లేదు. 

సబ్సిడీ కూడా లేదు..
బట్టలు, కూరగాయలు, పండ్లు, చాయ్​ అమ్మి స్ట్రీట్​ వెండర్లు వారి కుటుంబాలను పోషించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి బ్యాటరీ ఆటోలు ఇప్పిస్తామని చెప్పిందే తప్ప, సబ్సిడీ ప్రకటించ లేదు. బ్యాంక్​ లోన్ల ద్వారా ఆటోలు తీసుకొని, నెల నెలా ఈఎంఐలు కట్టుకోవాలని చెప్పింది. ఉదాహరణకు స్త్రీ నిధి క్రెడిట్​ కో ఆపరేటివ్​ ఫెడరేషన్​ లిమిటెడ్​ నుంచి ‘మెప్మా’కు నవంబరు 27, 2020 లో వచ్చిన లెటర్ ​ప్రకారం.. ఒక ఆటోకు రూ.3,04,427 లోన్​ ఇవ్వాలని, లబ్ధిదారుడు నెలకు రూ.6,720 చొప్పున 60 నెలలు ఈఎంఐలు కట్టాలని ఉంది. ఈ లెక్కన అసలుతో పాటు లక్ష రూపాయలు ఎక్స్​ట్రా కట్టాల్సి ఉంటుంది. ఇది వీధి వ్యాపారులకు భారం అవుతోంది.

క్షేత్ర స్థాయిలో అవగాహన నిల్​
జిల్లాలో 14,781 మంది స్ర్టీట్​ వెండర్లు ఉంటే, అందులో పది శాతం మందికి కూడా ఈ -ఆటోల గురించి తెలియడం లేదు. ప్రతి మున్సిపాలిటీలో ఈ -ఆటోలను ఏర్పాటు చేసి దాని గురించి వివరించాల్సి ఉన్నా, ఒక్క పాలమూరులో తప్ప భూత్పూర్​, జడ్చర్లలో ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ మున్సిపాలిటీల పరిధిలోని స్ట్రీట్​ వెండర్లను ఈ -ఆటోల గురించి ప్రశ్నిస్తే, అలాంటి ఆటోలు మాకు కూడా ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్లు వచ్చి వాటి గురించి వివరిస్తే, తాము కూడా తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఆఫీసర్​ కూడా మా వద్దకు వచ్చి ఈ -ఆటోల గురించి చెప్పలేదని అంటున్నారు.

మాకు ఎవరూ చెప్పలే..
మున్సిపల్​అధికారులు మా వద్దకు  వచ్చి.. మీ కోసం ఈ స్కీమ్​ ఉందని ఎప్పుడూ చెప్పలే. వీధి వ్యాపారులకు బ్యాటరీ ఆటోలు లోన్ ​కింద ఇస్తరనే విషయం మీరు చెప్తేనే వింటున్న. అధికారులు వచ్చి ఆటోల గురించి చెప్తే.. దాని పని తీరు చూసి.. తీసుకోవాలా? వద్దా? అని ఆలోచన చేస్తా.
-శ్రీనివాస్​, పండ్ల వ్యాపారి, జడ్చర్ల

ఎలాంటి సమాచారం​ చెప్పరు
కుటుంబాన్ని పోషించుకునేందుకు భూత్పూర్​ ఫ్లైఓవర్​ కింద తోపుడు బండి ఏర్పాటు చేసుకొని పండ్లు అమ్ముకుంటున్న. మాలాంటి వీధి వ్యాపారులకు గవర్నమెంట్​ స్కీమ్​లు ఉంటాయనే విషయం నాకు తెల్వదు. బ్యాటరీ ఆటోలు ఎట్లుంటయో కూడా నేను చూడలే. ఏ అధికారి వచ్చి ఆ ఆటో గురించి నాకు చెప్పలే.
- శ్రీనివాసులు, పండ్ల వ్యాపారి, భూత్పూర్​