చైనా నుంచి ఎవరూ ఇండియాకి రావొద్దు: ఇండియన్ ఎంబసీ

చైనా నుంచి ఎవరూ ఇండియాకి రావొద్దు: ఇండియన్ ఎంబసీ

చైనాలో కరోనా వైరస్ కలకలంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా వాళ్లకు ఆన్ లైన్ లో జారీ చేసే ఈ – వీసా విధానాన్ని సస్పెండ్ చేస్తూ తక్షణం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ – వీసాలు పొందిన వాళ్లు కూడా ఇండియాకు రావొద్దని, అవి చెల్లవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని చైనాలోని భారత ఎంబసీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ – వీసాల రద్దు కేవలం చైనా దేశస్థులకే కాక, అక్కడ ఉంటున్న ఇతర దేశాల పౌరులకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే తాత్కాలికంగా కొన్నాళ్లపాటు మాత్రమే ఈ-వీసాల నిలిపివేత కొనసాగుతుందని తెలిపింది.

భారత్ రావడం తప్పనిసరి అయితే…

చైనీయులే కాకుండా, చైనాలో ఉంటున్న విదేశీయులు కూడా భారత్ వచ్చేందుకు అనుమతించడం లేదు. ఇండియాలో కరోనా వ్యాప్తికి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఇప్పటికే ఈ – వీసాలు జారీ అయినా సరే చైనా నుంచి భారత్ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు ఎంబసీ అధికారులు. ఒకవేళ ఎవరైనా తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ కు రావాల్సి ఉంటే ఎంబసీకి వచ్చి కలవాలని తెలిపారు. చైనా రాజధాని బీజింగ్ లోని భారత ఎంబసీ లేదా షాంఘైలోని ఇండియన్ కాన్సులేట్, ఇతర ప్రాంతాల్లో ఉన్న భారత వీసా అప్లికేషన్ సెంటర్లలో వచ్చి వారి అవసరాన్ని వివరించాలని స్పష్టం చేశారు.

చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ నియంత్రణకు భారత్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని ఎయిర్ పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేసి, ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ ప్రయాణికులను ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తోంది. వారికి కరోనా లేదని నిర్ధారణ అయిన తర్వాతే బయటి పంపుతున్నారు అధికారులు. అలాగే చదువు, ఉద్యోగాలు, ఇతర కారణాల రీత్యా చైనాలో ఉంటున్న వారిని ఈ వైరస్ బారి నుంచి రక్షించే ప్రత్యేక విమానాల్లో నిన్న ఢిల్లీకి తీసుకొచ్చారు. వారందరినీ ప్రత్యేకమైన క్యాంపులో ఉంచి 15 రోజుల పాటు డాక్టర్ల అబ్జర్వేషన్ లో పెట్టారు. ఈ లోపు కరోనా లక్షణాలేవీ కనిపించకుంటే ఇంటికి పంపుతారు.

చైనా వాళ్లు ఇండియాకి రావొద్దు: ఇండియన్ ఎంబసీ