ప్రజాపాలనలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరేలా కృషి ..రూ.1,64,431 కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశాం

ప్రజాపాలనలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరేలా కృషి ..రూ.1,64,431 కోట్లు  ప్రజల ఖాతాల్లో జమ చేశాం
  •     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్/​అమ్రాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మూడేండ్లలో రూ.1,64,431 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని, ఈ లెక్కలపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. 

బుధవారం నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రూ.74.82 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మన్ననూర్‌‌‌‌‌‌‌‌లో రూ.53.78 కోట్లతో నిర్మించనున్న 220/33 కేవీ విద్యుత్ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జిల్లాల్లోని సహజ వనరుల ఆధారంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అచ్చంపేటను ప్రధాన రవాణా కూడలిగా తీర్చిదిద్దడంతో పాటు నల్లమలను ఎకో టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 

రైతు భరోసా, పంట రుణమాఫీ, 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ లోటును సరిచేసేందుకు ఇప్పటికే రూ.75 కోట్లతో 1,219 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు, 403 కిలోమీటర్ల కొత్త విద్యుత్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేశామని, 5 వేల కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్​ వీ పాటిల్, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.