- పొలం దగ్గరే ఉరేసుకొని ఆత్మహత్య
శివ్వంపేట, వెలుగు: నీటి తడులు అందక వరి పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం భీమ్లాతండా గ్రామపంచాయతీ పరిధి శంకర్తండాలో బుధవారం జరిగింది.
మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం... తండాకు చెందిన మాలోత్ శంకర్ (45) వానాకాలంలో బోరు ఆధారంగా వరి సాగు చేశాడు. మూడు రోజుల కిందట బోరు మోటారు కాలిపోవడంతో మంగళవారం రిపేర్లు చేయడానికి బోరుబావిలో నుంచి మోటార్ ను పైకి తీస్తుండగా 4 పైపులతో సహా మోటార్ బోరు బావిలో పడిపోయింది.
మెకానిక్ ను తీసుకొచ్చి మోటార్ ను బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో మోటారు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటం, నీటి తడులు అందక వేసిన పంట ఎండిపోతోంది. కాగా, బోరు రిపేరు కోసం బావి వద్దకు వెళ్లిన శంకర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం పొలం వద్దకు వెళ్లి చూడగా, అతడు చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు.
పొలం ఎండిపోతుండడంతో మనస్తాపానికి గురై శంకర్ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి తండ్రి భీమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.
