భారత్ ఆపన్నహస్తం.. మరోసారి థ్యాంక్స్ చెప్పిన టర్కీ రాయబారి

భారత్ ఆపన్నహస్తం.. మరోసారి థ్యాంక్స్ చెప్పిన టర్కీ రాయబారి

భారీ భూకంపంతో టర్కీ కకావికలం అయ్యింది. టర్కీ, సిరియాలలో మొత్తం 33వేల మందికి పైగా మరణించారు. ఆపదలో ఉన్న టర్కీ, సిరియా దేశాలకు భారత్ అండగా నిలుస్తోంది. ఇప్పటికే రెస్క్యూ టీంలను పంపిన భారత్.. ఆపరేషన్‌ దోస్త్‌ లో భాగంగా అత్యవసర సామాగ్రిను అందజేస్తోంది. అందులో భాగంగానే 23 టన్నులకు పైగా సహాయక సామాగ్రితో ఏడవ ఆపరేషన్‌ దోస్త్‌ విమానాన్ని భారత్‌ టర్కీ, సిరియాకు పంపించింది. దీనిని డమాస్కస్‌ ఎయిర్ పోర్టులో స్థానిక పరిపాలన, పర్యావరణ డిప్యూటీ మంత్రి మౌతాజ్‌ డౌజీ అందుకున్నారు.

భారత్ సాయంపై టర్కీ రాయబారి ఫిరత్‌ సునెల్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశానికి మరోసారి సహాయక సామాగ్రిని పంపినందుకు భారత్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారత ప్రజల నుంచి మరో బ్యాచ్‌ అత్యవసర విరాళాలు టర్కీకి చేరుకున్నాయి. భూకంప బాధితులకు టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు వంటివి ఎంతో ముఖ్యమైనవి. భూకంపం సంభవించిన ప్రాంతానికి భారత్ ప్రతి రోజు ఎంతో ఉదారంగా ఉచిత సహాయాన్ని అందజేస్తోంది. థ్యాంక్యూ ఇండియా’’ అని ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం కావాలని ఆకాంక్షించిన ఫిరత్.. ఆపరేషన్‌ దోస్త్‌ మనం ఎప్పటికీ స్నేహితులమని నిరూపించిందని వ్యాఖ్యానించారు.