డ్రగ్స్ కస్టమర్లపై ఈగల్ ఫోర్స్ నిఘా.. అదేపనిగా పట్టుపడుతున్న వారిపై ఛార్జిషీట్లు

డ్రగ్స్ కస్టమర్లపై ఈగల్ ఫోర్స్ నిఘా.. అదేపనిగా పట్టుపడుతున్న వారిపై ఛార్జిషీట్లు
  • నెల రోజుల వ్యవధిలో 42 మంది అరెస్టు, చార్జిషీట్లు    
  • పోలీసుల వద్ద 316 మంది మహిళలు సహా 14 వేల కస్టమర్ల డేటా

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్‌‌, గంజాయి కస్టమర్లలో మార్పు తెచ్చేందుకు ఈగల్  ఫోర్స్‌‌ స్పెషల్  ఆపరేషన్లు ప్రారంభించింది. రెగ్యులర్‌‌‌‌గా డ్రగ్స్ ఆర్డర్లు చేస్తూ.. గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని ట్రేస్  చేస్తోంది. ఇందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో 42 మంది రిపీటెడ్  కస్టమర్లను గుర్తించి వారిపై చార్జిషీట్లు దాఖలు చేసింది. గ్రేటర్‌‌ ‌‌హైదరాబాద్‌‌లోని మూడు కమిషనరేట్లు సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని కస్టమర్లను కట్టడి చేసేందుకు సప్లయర్ల డేటా ఆధారంగా ఆపరేషన్లు నిర్వహిస్తోంది. 

గతంలో పట్టుబడి కౌన్సెలింగ్‌‌  తీసుకున్న వారితో పాటు డీఅడిక్షన్  సెంటర్లకు వెళ్లిన వారిని గుర్తిస్తోంది. మళ్లీమళ్లీ డ్రగ్స్ కొనుగోలు చేసి పట్టుబడుతున్న వారిపై లీగల్ యాక్షన్  తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇప్పటికే నమోదైన గంజాయి, డ్రగ్స్  కేసుల్లో కంజ్యూమర్లుగా 40 ఏళ్లలోపు వయసు ఉన్న యువతే పోలీసులకు చిక్కుతోంది. వీరిలో ఈగల్  ఫోర్స్‌‌ గణాంకాల ప్రకారం 316 మంది యువతులు సహా14 వేల మంది రెగ్యులర్  కస్టమర్లను ఈగల్ ఫోర్స్‌‌ గుర్తించింది. 

అదేపనిగా పట్టుబడిన కస్టమర్లకు కౌన్సెలింగ్‌‌ ఇవ్వడంతో పాటు  డీఅడిక్షన్ సెంటర్లకు పంపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో నిరంతరం నిఘా పెడుతున్నారు. డ్రగ్స్‌‌కు దూరంగా ఉంటున్నారని, మార్పు వచ్చిందని సంబంధిత డాక్టర్లు, కౌన్సెలర్లు సర్టిఫై చేస్తే తప్ప వారిపై ఉన్న కేసులను తొలగించడం లేదు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌‌  సప్లయర్ల వివరాలను సేకరిస్తున్నారు. 

పోలీసులకు చిక్కేది కేవలం 25 శాతమే!

డ్రగ్స్  కస్టమర్లలో మార్పు తెస్తే తప్ప డ్రగ్స్‌‌ నెట్‌‌వర్క్‌‌ను బ్రేక్‌‌ చేసే పరిస్థితులు లేవు. డ్రగ్స్  సప్లయర్లు, కస్టమర్లు 25 శాతమే పోలీసులకు చిక్కుతుండగా.. డార్క్‌‌వెబ్‌‌, ఆన్‌‌లైన్‌‌, కొరియర్‌‌‌‌లో డ్రగ్‌‌  సరఫరా చేస్తున్న వారిని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. దీంతో డ్రగ్స్‌‌  మాఫియా నెట్‌‌వర్క్‌‌ను ట్రాక్  చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్, వాట్సాప్‌‌లలో కోడ్  భాషతో జరుగుతున్న దందాను ఈగల్‌‌  సహా పోలీసులు డెకాయ్  ఆపరేషన్లతో ఛేదిస్తున్నారు.