ఎగ్జామ్ పూర్తయిన వెంటనే మార్కులు డిస్ప్లే... ఎప్ సెట్, పీజీ ఈసెట్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం

ఎగ్జామ్ పూర్తయిన వెంటనే మార్కులు డిస్ప్లే... ఎప్ సెట్, పీజీ ఈసెట్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం
  •     అప్పటికప్పుడు ‘టెంపరరీ ర్యాంకులు’ కూడా తెలుసుకోవచ్చు
  •     ఈసారి మొబైల్ నుంచే ఈజీగా అప్లికేషన్‌కు అవకాశం 
  •     రూ.10 వేల ఫైన్‌తో పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు  అప్లై చేసుకునేందుకు చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించే వివిధ కోర్సుల ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విధానంలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. ఎగ్జామ్ పూర్తయిన వెంటనే మార్కులు తెలుసుకునేలా మార్పులు తీసుకొస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన టీజీ ఎప్‌సెట్, పీజీ ఈసెట్ పరీక్షల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. సాధారణంగా ఆన్‌లైన్ ఎగ్జామ్ పూర్తయిన వెంటనే అభ్యర్థులు ‘సబ్మిట్’బటన్ నొక్కగానే థాంక్యూ అని వస్తోంది. కానీ, కొత్త విధానం అమలు అయితే, విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా స్ర్కీన్‌పై డిస్ ప్లే కానున్నది. 

కేవలం టోటల్ మార్కులే కాకుండా.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా సబ్జెక్టుల వారీగా ఎన్ని మార్కులు వచ్చాయో క్లియర్‌గా చూపించనున్నారు. దీంతో పాటు ఆ సెషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా గతేడాది ర్యాంకులకు అనుగుణంగా ‘టెంపరరీ ర్యాంకు’ను కూడా వెల్లడించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నిర్ణయంతో అభ్యర్థులకు తమ పర్ఫార్మెన్స్‌పై వెంటనే ఒక అంచనా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 

మొబైల్ నుంచే అప్లికేషన్..

జవహార్‌‌లాల్‌ నెహ్రూ జేఎన్టీయూహెచ్ నిర్వహించే పీజీ ఎప్ సెట్, పీజీఈసెట్ ఎగ్జామ్స్ నిర్వహణలో టెక్నాలజీని మరింత వాడుకోనున్నారు. ఇప్పటివరకూ కంప్యూటర్, లాప్ ట్యాప్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఈ సారి నుంచి అభ్యర్థులు స్మార్ట్ ఫోన్ల నుంచే సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే పనిలేకుండా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా మొబైల్ అప్లికేషన్ ప్రాసెస్‌ను డిజైన్ చేసినట్టు అధికారులు చెప్పారు. 

2 రోజుల ముందు వరకూ చాన్స్..

వివిధ కారణాలతో సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు చివరి చాన్స్ ఇవ్వనున్నారు. ఈసారి పరీక్షలు ప్రారంభమయ్యే చివరి రెండ్రోజుల ముందు వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించినట్టు టీజీ ఎప్‌ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. అయితే, రూ.పది వేల లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ కేటగిరీలో అప్లై చేసిన వారికి వారి సొంత జిల్లాల్లో కాకుండా గ్రేటర్‌‌ హైదరాబాద్‌లోని పరీక్షా కేంద్రాలను మాత్రమే కేటాయించనున్నట్టు చెప్పారు.