మునుగోడు గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

మునుగోడు గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

హైదరాబాద్‌‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రులు కేటీఆర్‌‌, హరీశ్‌‌రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. బైపోల్‌‌ షెడ్యూల్‌‌ వెలువడటంతో సోమవారం ప్రగతి భవన్‌‌లో మంత్రులు, పలువురు నాయకులతో కేసీఆర్‌‌ సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఉన్న మంత్రి జగదీశ్‌‌ రెడ్డి, ఇతర ఇన్‌‌చార్జ్‌‌లతో ఫోన్‌‌లో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, తాజా సర్వేలు ఏం చెప్తున్నాయి అనే అంశాలపై వారితో చర్చించారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజిస్తున్నామని, ఒక్కో యూనిట్‌‌ (రెండు ఎంపీటీసీ స్థానాల పరిధి)కి ఒక్కో ఎమ్మెల్యే ఇన్‌‌చార్జ్‌‌గా ఉంటారని చెప్పారు. ఇన్‌‌చార్జీలుగా నియమితులైన వారంతా దసరా పండుగ తర్వాత కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారం ముగిసే దాకా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రచారం చేయాలని సూచించారు.

ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో కలిసి గ్రామాలకు వెళ్లాలన్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు అందజేస్తామని, వారి ఇండ్లకు వెళ్లి టీఆర్‌‌ఎస్‌‌కు ఓటు వేసేలా వారిని ఒప్పించాలన్నారు. ఈనెల నాలుగో వారంలో తాను ఉప ఎన్నిక ప్రచారానికి వస్తానని తెలిపారు. మంత్రి జగదీశ్‌‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేయాలని, కేటీఆర్‌‌, హరీశ్‌‌ రావు ఎప్పటికప్పుడు ప్రచార సరళిని పర్యవేక్షిస్తారని తెలిపారు. వారిద్దరితో పాటు కేబినెట్‌‌లోని మంత్రులు కూడా ప్రచారానికి వస్తారని తెలిపారు. మునుగోడులో గెలుపు మనదేనని, ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.