కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్ల నుంచి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ దిగ్గజ సంస్థ ఎల్ఐసీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై తీసుకొస్తున్న కొత్త నిబంధనలు, పన్నులతో ఐటీసీ స్టాక్ కుప్పకూలగా ఆ ప్రభావం ఎల్ఐసీపై భారీగానే కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2026 నుంచి సిగరెట్లపై పన్నులను భారీగా సవరిస్తూ తీసుకున్న నిర్ణయం ఐటీసీ షేర్లలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలోనే ఐటీసీ షేర్లు ఘోరంగా పడిపోవడంతో.. అందులో భారీ వాటా కలిగి ఉన్న LIC ఏకంగా రూ.11వేల కోట్ల మేర నష్టాన్ని చూసింది. ఇది అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు మార్కెట్ వర్గాల్లో కూడా భారీ చర్చకు దారితీసింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఫిబ్రవరి 1, 2026 నుండి సిగరెట్లపై ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ ఏకంగా 40 శాతానికి పెరగనుంది. గతంలో ఉన్న ఫిక్స్‌డ్ సెస్, అడ్ వాల్యూమ్ రేట్లకు బదులుగా ప్రతి వెయ్యి సిగరెట్ స్టిక్స్‌పై కొత్తగా ప్రాథమిక ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల సిగరెట్ల ధరలు 15 నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పన్ను భారంతో ఐటీసీ సిగరెట్ అమ్మకాలు తగ్గి, కంపెనీ లాభదాయకతపై ప్రభావం పడుతుందనే భయంతో ఇన్వెస్టర్లు ఐటీసీ షేర్లను అమ్మేందుకు ప్రేరేపించింది కొత్త ఏడాది ప్రారంభంలోనే.
ALSO READ : కొత్త ఏడాదిలో కొత్త కార్లు: స్కోడా, మారుతి, మహీంద్రా నుంచి న్యూ మోడల్స్
తాజా పరిణామాలతో ఐటీసీలో 15.86 శాతం వాటాతో రెండవ అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఉన్న ఎల్‌ఐసీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. బుధవారం నాటికి ఐటీసీలో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ. 80వేల 080 కోట్లుగా ఉండగా.. కేవలం రెండు రోజుల్లోనే అది రూ.69వేల 498 కోట్లకు పడిపోయింది. అంటే ఎల్‌ఐసీ సంపద రెండు రోజుల్లోనే రూ.10వేల 581 కోట్లు ఆవిరైపోయింది. ఎల్‌ఐసీ 2017 నుండి ఈ సంస్థలో తన పెట్టుబడిని స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న వేళ అనుకోని ఎదురుదెబ్బ తగిలింది ప్రస్తుతం. ఈ పరిస్థితులు దీర్ఘకాలంలో ఐటీసీకి సమస్యలు సృష్టిస్తాయని దేశీయ బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి.
ఐటీసీ షేర్లపై బ్రోకరేజీల మాట ఇదే..
తాజా పరిస్థితుల్లో బ్రోకరేజ్ సంస్థ 'ఎంకే గ్లోబల్' ఐటీసీ రేటింగ్‌ను 'యాడ్' నుండి 'రెడ్యూస్'కు తగ్గించేసింది. అలాగే స్టాక్ టార్గెట్ ధరను గతంలో ఇచ్చిన రూ.475 నుండి రూ.350కి భారీగా తగ్గించింది. భారీ పన్నుల వల్ల అక్రమ సిగరెట్ల వ్యాపారం మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని, ఇది ఐటీసీ వంటి చట్టబద్ధమైన సంస్థల మార్కెట్ వాటాను దెబ్బతీస్తుందని ఆందోళనలు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా పొగాకు ఉత్పత్తులపై పన్నుల స్థిరత్వం కారణంగా ఐటీసీ షేరు 50 శాతానికి పైగా వృద్ధి చెందినప్పటికీ.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఆ జోరుకు బ్రేకులు పడినట్లయింది.
