దోపిడీ రాజ్యం నుంచి తొందరలోనే విముక్తి : కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్

దోపిడీ రాజ్యం నుంచి  తొందరలోనే విముక్తి : కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్
  • నామినేషన్ ర్యాలీకి భారీగా హాజరైన కార్యకర్తలు

చేవెళ్ల, వెలుగు: దోపిడీ రాజ్యం నుంచి చేవెళ్ల సెగ్మెంట్ వాసులకు కాంగ్రెస్ పార్టీ తొందరలోనే విముక్తినిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో ఆయన నామినేషన్ ర్యాలీ నిర్వహించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పలు గ్రామాల నుంచి జనం భారీ ఎత్తున పాల్గొన్నారు. సీపీఐ పార్టీ నాయకులు పామెన భీం భరత్ కు మద్దతు తెలుపుతూ ర్యాలీకి తరలివచ్చారు. షాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ చేవెళ్ల ఆర్డీవో ఆఫీసు వరకు కొనసాగింది. ఆర్డీవో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి పామెన భీం భరత్ నామినేషన్ పేపర్లు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి జనం బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల స్కీమ్​తో బీఆర్ఎస్​లో వణుకు మొదలైందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు.చేవెళ్లలో తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు భీం భరత్ ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి, కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.