పుడమి రక్షణకు ఎర్త్ అవర్​ను పాటిద్దాం

పుడమి రక్షణకు ఎర్త్ అవర్​ను పాటిద్దాం

పారిశ్రామికీకరణ,  పట్టణీకరణ, జనాభా పెరుగుదల వలన రోజురోజుకు సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా భూగోళంపై గల సమస్త  జీవరాశులు పెను ముప్పును ఎదుర్కొంటున్నాయి. మానవ చర్యల్లో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం పెరగడం,  కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు, గృహంలో వాడే రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషినర్ల వలన "హరిత గృహా వాయువులు" విడుదలవుతున్నాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత, ఆమ్ల వర్షాలు వంటి దుష్ఫలితాలకు కారణమవుతున్నాయి. విపరీత ప్లాస్టిక్ వినియోగం,  రసాయన ఎరువుల వాడకాన్ని సమీప భవిష్యత్​లో నిలువరించకపోతే  తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. 

ప్రతి ఏటా 'ఎర్త్‌‌ అవర్‌‌’

ప్రకృతి మనకు ప్రతి ఏటా 125 ట్రిలియన్ డాలర్ల విలువగల ఆహారం, నీరు, గాలి మరియు ఇతర సేవలు అందిస్తోంది. అభివృద్ధి పేరుతో గత 50 సంవత్సరాల నుంచి ప్రకృతికి కనివినీ ఎరుగని నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా  డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్‌‌ అవర్‌‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది సుమారు 190 దేశాల్లోని ఏడువేల నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

 గత 18 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగహన కల్పించేందుకు ఈ సంస్ధ ప్రతి ఏటా'ఎర్త్‌‌ అవర్‌‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో  గృహాలు,  వ్యాపార కేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో గంటపాటు విద్యుత్‌‌ కాంతులను ఆపివేసి పర్యావరణానికి మేలు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మనదేశం కూడా ఈ సామూహిక పర్యావరణ హిత కార్యక్రమంలో భాగం కానుంది. ఈ క్రమంలో 2024కు గాను 'ఎర్త్‌‌ అవర్‌‌ ఇండియా' గుడ్‌‌విల్‌‌ అంబాసిడర్‌‌ భారత బ్యాడ్మింటన్ స్టార్‌‌ పీవీ సింధు ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి చివరి శనివారం ఎర్త్ అవర్​ను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈ ఏడాది మార్చి 23న  సాయంత్రం 8:30 నుంచి 9: 30 వరకు ఈ కార్యక్రమం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నిర్వహించనుంది. కావున,  అందరం గంట పాటు లైట్లను ఆపి ఎర్త్ అవర్​లో భాగమవుదాం. తద్వారా విశ్వ మానవాళి ఆరోగ్యం, ఆనందం, ఆదాయం, మనుగడకు బాటలు వేద్దాం.

- సంపతి రమేష్ మహరాజ్, సోషల్​ ఎనలిస్ట్