న్యూజిలాండ్ లో భారీ  భూకంపం

న్యూజిలాండ్ లో భారీ  భూకంపం

న్యూజిలాండ్ దేశంలో భారీ భూకంపం వచ్చింది. భారత కాలమానం ప్రకారం మార్చి 4వ తేదీ.. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో న్యూజిలాండ్‌ దేశం కెర్మాడెక్ దీవుల కేంద్రంగా భూ కంపం ఉన్నట్లు ప్రకటించింది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే. భూ కంప తీవ్రత రిక్కర్ స్కేల్ పై 6.9గా నమోదైంది. భూమికి 152 కిలోమీటర్ల లోతులో భూమి పొరలు కంపించాయని.. దీని తీవ్రత భూకంప కేంద్ర నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉందని స్పష్టం చేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం. 

6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని.. స్థానిక అధికారులను అప్రమత్తం చేశామని.. వివరాలు సేకరిస్తున్నట్లు  వెల్లడించింది అక్కడి ప్రభుత్వం. నెల రోజులుగా న్యూజిలాండ్ దేశాన్ని తుఫాన్లు, భూ కంపాలు భయపెడుతున్నాయి. రెండు వారాల క్రితమే  న్యూజిలాండ్ లోని గిస్బోర్న్ నగరంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు అయింది. అంతకముందు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

నెల రోజుల వ్యవధిలోనే మూడు భూకంపాలు రావటంతో న్యూజిలాండ్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనికితోడు ఇటీవల వచ్చిన తుఫాన్ గాబ్రిల్లా సైతం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన భూకంపం వల్ల ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా లేదా అనే తెలియాల్సి ఉంది..