న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో మంగళవారం రాత్రి భూకంపం కలకలం సృష్టించింది. చమోలీ కేంద్రంగా రాత్రి 10:20 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఉత్తరాఖండ్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు అధికారిక ఎలాంటి సమాచారం వెలువడలేదు.
రాత్రి 10:40 గంటలకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూకంపాన్ని అధికారికంగా ధ్రవీకరించింది. అంతకు ముందు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధారణ రాకపోవడంతో చాలా మంది సోషల్ మీడియాలోకి వచ్చి అసలు భూకంపం వచ్చిందా లేదా అని ఆరా తీశారు. సఫ్దర్‌జంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తాను కూర్చున్న సోఫా ఒక్కసారిగా కదలడాన్ని గమనించినట్లు తెలిపారు.
