హైతీలో భూకంపం.. 300 మందికి పైగా మృతి

హైతీలో భూకంపం.. 300 మందికి పైగా మృతి

కరేబియన్​ దేశం హైతీలో శనివారం భారీ భూకంపం సంభవించింది. నైరుతి హైతీలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2‌గా నమోదైంది. ఈ ఘటనలో 300 మందికిపైగా మరణించారు. సెయింట్ లూయిస్-డు-సుడ్‌కు ఈశాన్యంగా 12 కిలోమీటర్లు దూరంలో భూకంపం సంభవించిందని.. దాని కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

ఈ భూకంపం దేశంలో పలుచోట్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. ఈ క్రమంలోనే హైతీ ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ.. అత్యవసర పరిస్థితని ప్రకటించారు. ఇది ఒక నెల రోజుల పాటు కొనసాగనుంది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 304 మంది మరణించారని, 1800 మందికి పైగా గాయపడ్డారని హైతీ సివిల్ ప్రొటెక్షన్ సర్వీసెస్ వెల్లడించింది. శిథిలాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.