
మనం దానిమ్మ పండు తొక్క తీసి గింజలను సాధారణంగా లేదా అనారోగ్యానికి గురైనపుడు లేదా ఫ్రూట్ జ్యూసెస్, సలాడ్స్ చేసుకొని తింటుంటాం. కానీ దానిమ్మ పండు తొక్కలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా...? దానిమ్మ గింజల కోసం పారేసే తొక్కలో విటమిన్లు, మినరల్స్, ఇంకా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చాలామందికి తెలియదు.
దానిమ్మ తొక్కలో ఉండే ప్రయోజనాలు కోసం దానిమ్మ తొక్క టీ చాలా బెస్ట్ మార్గం. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో, వారానికి రెండు సార్లు ఈ టి తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా....
దానిమ్మ తొక్కతో టీ ఎలా తయారీ చేయాలంటే: మొదట ఫ్రెష్ దానిమ్మ పండు తొక్క శుభ్రంగా కడిగి తీసుకుకోవాలి. అలాగే 2 కప్పుల నీరు ఇందుకు అవసరం. రుచి కోసం అవసరమైతే తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
తయారీ : ఫ్రెష్ దానిమ్మ తొక్కను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ ఎండిన తొక్క అయితే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇప్పుడు దాని ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత, అందులో దానిమ్మ తొక్క ముక్కలు వేసి 10-15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత టీని ఒక కప్పులోకి వడపోసి, మీకు కావాలంటే రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలపోచ్చు.
*దానిమ్మ తొక్క టీ తాగితే కలిగే లాభాలు: దానిమ్మ తొక్కలో పాలీఫెనాల్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
*వైద్యంలో జీర్ణ సమస్యలకు దానిమ్మ తొక్కను తరచుగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపు నొప్పిని తగ్గించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
*దానిమ్మ తొక్కలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మంపై వచ్చే మచ్చలు, మొటిమలు, వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. ఇంకా యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
*బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి దానిమ్మ తొక్క సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా సహజమైన మూత్రవిసర్జన, శరీరంలోని అదనపు ద్రవాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.