
వెజిటబుల్స్‌లో ఆలుగడ్డలు ఇష్టపడనివాళ్లుండరు. ఆలూతో ఎలా వండినా రుచికరంగా ఉంటుంది. అందుకే ఎంత తిన్నా తినాలనిపిస్తుంటుంది. ప్రాంతం మారేకొద్దీ వీటితో ఎన్నో వెరైటీలు రుచి చూడొచ్చు. ఈ వారం ఆలూతో మసాలా, దమ్, జీరా కాంబినేషన్స్‌తో ట్రై చేసి చూడండి.
జీరా ఆలూ
కావాల్సినవి :
ఆలుగడ్డలు – నాలుగు
జీలకర్ర – రెండు టీస్పూన్లు
ధనియాల పొడి – ఒక టీస్పూన్
ఇంగువ – చిటికెడు
ఉప్పు – సరిపడా, అల్లం తరుగు, కారం, గరం మసాలా, కసూరీమేథి – ఒక్కోటి అర టీస్పూన్, పచ్చిమిర్చి – ఒకటి, పసుపు, ఆమ్చూర్ పొడి – ఒక్కోటి పావు టీస్పూన్, కొత్తిమీర – కొంచెం
తయారీ :
ఆలుగడ్డలు ఉడికించి తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఇంగువ వేసి వేగించాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు, అల్లం తరుగు, కారం, పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి, కసూరీమేథి, కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలపాలి.
మసాలా
కావాల్సినవి :
ఆలుగడ్డలు (ఉడికించి) – అర కిలో
ఉప్పు, నూనె – సరిపడా
తాలింపు దినుసులు, కారం, ధనియాలపొడి, గరం మసాలా – ఒక్కో టీస్పూన్, ఎండుమిర్చి – రెండు
ఇంగువ – చిటికెడు
పసుపు – అర టీస్పూన్
ఉల్లిగడ్డలు, టొమాటోలు – రెండేసి చొప్పున
కరివేపాకు – కొంచెం
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
తయారీ :
పాన్‌లో నూనె వేడి చేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేగించాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. తర్వాత టొమాటో తరుగు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి కలపాలి. నీళ్లు పోసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆపై ఆలుగడ్డ ముక్కలు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరి.
దమ్
కావాల్సినవి :
ఆలుగడ్డలు (చిన్నవి) – అర కిలో
ఉప్పు, నూనె – సరిపడా
ధనియాల పొడి, కశ్మీరీ కారం, జీలకర్ర – ఒక్కో టీస్పూన్
పసుపు, కారం, జీలకర్ర పొడి – ఒక్కోటి అర టీస్పూన్
ఉల్లిగడ్డలు, యాలకులు, టొమాటోలు – రెండేసి చొప్పున
వెల్లుల్లి రెబ్బలు – ఆరు
జీడిపప్పులు – పది
అల్లం – చిన్న ముక్క
మిరియాలు – పావు టీస్పూన్
బిర్యానీ ఆకు – ఒకటి
నల్ల యాలక, దాల్చిన చెక్క – ఒక్కోటి
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
మిక్సీజార్‌లో ఉల్లిగడ్డ తరుగు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో తొక్కతీసిన ఆలుగడ్డలు వేసి వేగించి పక్కనపెట్టాలి. అదే పాన్‌లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, నల్ల యాలక, మిరియాలు వేసి వేగించాలి. తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కలపాలి. ఒక గిన్నెలో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కశ్మీరీ కారం వేసి నీళ్లు పోసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కూడా పాన్‌లో పోసి కలపాలి. మిక్సీజార్‌లో టొమాటో ముక్కలు, నానబెట్టిన జీడిపప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమం కూడా పాన్‌లో వేసి మరోసారి కలపాలి. నూనె పైకి తేలాక పెరుగు వేసి కలిపిన తర్వాత ఆలుగడ్డలు వేయాలి. చివరిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసి మూతపెట్టాలి. మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికిస్తే దమ్ ఆలూ రెడీ.