ఈటల రాజేందర్ సరికొత్త రికార్డు

ఈటల రాజేందర్ సరికొత్త రికార్డు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్ సరికొత్త రికార్డు సాధించారు. ఆయన వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో తొలిసారి కమలాపూర్‌‌‌‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2008 ఉప ఎన్నికలో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2018, 2021(ఉప ఎన్నిక) ఎన్నికల్లో గెలిచారు. కాగా, ఇప్పటి వరకు కాంగ్రెస్‌‌‌‌ నేత బాగారెడ్డి మాత్రమే వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన జహీరాబాద్‌‌‌‌ నియోజకవర్గం నుంచి 1957 నుంచి 1985 వరకు వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. 2004లో బాగారెడ్డి చనిపోయారు. ఇప్పుడాయన రికార్డును సమం చేసిన ఈటలకు దాన్ని క్రాస్ చేసే చాన్స్ ఉంది. అదే విధంగా కాంగ్రెస్‌‌‌‌ నేత జానారెడ్డి కూడా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఆయన వరుసగా ఎన్నిక కాలేదు. మధ్యలో పలుసార్లు ఓడిపోయారు. అయితే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సీఎం కేసీఆర్‌‌‌‌ పేరు మీద ఉంది. కానీ కేసీఆర్‌‌‌‌ వరుస ఎన్నికల్లో గెలవలేదు. మధ్యలో ఎంపీ అయ్యారు. ఇక దేశంలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, కేరళ కాంగ్రెస్‌‌‌‌ నేత కేఎం మణి పేరు మీద ఉంది. వీరిద్దరూ 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.