టీఆర్​ఎస్​ పంచిన కోట్ల డబ్బు, అధికార బలం పన్జెయ్యలే

టీఆర్​ఎస్​ పంచిన కోట్ల డబ్బు, అధికార బలం పన్జెయ్యలే
  • కేసీఆర్ ఫ్యూజు పీకాలని జనం ఫిక్సయిన్రు: ఈటల 
  • ఆత్మగౌరవంతో బీజేపీకే ఓటేసిన్రు 
  • ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతయ్ 

హైదరాబాద్/కమలాపూర్, వెలుగు:  హుజూరాబాద్‌లో టీఆర్ఎసోళ్లు వందల కోట్ల డబ్బు పంచినా, అధికార బలంతో ప్రలోభాలకు గురిచేసినా జనం లొంగలేదని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో తన ముఖం కనిపించొద్దన్న సీఎం కేసీఆర్ పంతం నెరవేరలేదన్నారు. కరీంనగర్ చైతన్యవంతమైన గడ్డ అని, హుజూరాబాద్ అంతకంటే చైతన్యవంతమైందని చెప్పారు. అణచివేతను ఇక్కడి ప్రజలు ఒప్పుకోరని.. ధర్మం, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. రూ.500 కోట్లు పంచి పెట్టినా, వందలాది మంది పోలీసులు టీఆర్ఎస్​కు అనుకూలంగా పని చేసినా... కేసీఆర్ ఫ్యూజు పీకాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. అందుకే బీజేపీకే ఓటేశారన్నారు. అధికార పార్టీ వాళ్లు ఓటుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇచ్చినా ప్రజలు తనకే ఓటేశారన్నారు. శనివారం కమలాపూర్ మండల కేంద్రంలో ఓటు వేసిన తర్వాత, పోలింగ్ ముగిశాక హుజూరాబాద్ మధువని గార్డెన్స్​లో ఈటల మీడియాతో మాట్లాడారు. 

అది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ... 
‘‘రూలింగ్​పార్టీ వేల కోట్ల స్కీమ్ లు, వందల కోట్లతో ప్రలోభాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆ పార్టీ లీడర్లు ప్రతి కుటుంబాన్నీ భయభ్రాంతులకు గురి చేశారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా జనం మాత్రం ఆత్మగౌరవానికే ఓటేశారు” అని ఈటల చెప్పారు. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ‘‘పోలీస్ ఎస్కార్టు పెట్టి మరీ డబ్బు తెచ్చి పంచిన్రు. మద్యం ఏరులై పారింది. రూ.6 వేల కోసం కొందరు ఓటర్లు రోడ్డెక్కిన పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యానికి ఇదో మాయని మచ్చ’’ అని ఈటల చెప్పారు. పోలింగ్ టైమ్ లోనూ టీఆర్ఎస్ డబ్బులు పంచిందని ఆరోపించారు. 

అందరూ కష్టపడ్డరు...  
పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలందరూ తన గెలుపుకు కష్టపడ్డారని ఈటల చెప్పారు. ప్రతి ఒక్కరూ గొప్పగా పని చేశారని.. ముఖ్యంగా యువత, విద్యార్థులు గట్టిగా ప్రయత్నించారని తెలిపారు. దళిత బంధు రాదని బెదిరించినా ఎవరూ భయపడలేదన్నారు. నిరంకుశత్వాన్ని బొంద పెట్టడం కోసం అందరూ ఏకమయ్యారన్నారు. తన గెలుపును రాష్ట్ర ప్రజలకే అంకితమివ్వబోతున్నానని చెప్పారు. నవంబర్ 2 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఈటలపై జనానికి ఉన్న ప్రేమ ముందు.. కేసీఆర్ కుట్రపూరిత రాజకీయాలు ఓడిపోయాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ కు గుణపాఠం తప్పదని, 2023లో గోల్కొండ మీద ఎగరబోయేది బీజేపీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.