ఈటలపై ఆరోపణలను జనం నమ్మలే

ఈటలపై ఆరోపణలను జనం నమ్మలే
  •     దళితుల భూములు లాక్కున్నారని మాజీ మంత్రిపై ఫిర్యాదులు 
  •     50 వేల ఎస్సీ ఓట్లున్న చోటే భారీ మెజార్టీతో గెలిచిన రాజేందర్ 


హైదరాబాద్‌, వెలుగు: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలను జనం నమ్మలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో దళితులకు చెందిన దాదాపు వంద ఎకరాల అసైన్డ్‌ భూములను ఈటల రాజేందర్ అక్రమంగా లాక్కున్నారని ఆరోపిస్తూ కొందరు సీఎం కేసీఆర్‌కు లెటర్లు రాశారు. దీనిపై సీఎం విచారణకు ఆదేశించగా, ఈటల 66 ఎకరాల భూమి కబ్జా చేశారని మెదక్‌ కలెక్టర్‌ హరీశ్ రిపోర్టు ఇచ్చారు. దీంతో ఈటల వద్దనున్న హెల్త్ మినిస్ట్రీని తీసేసుకున్న కేసీఆర్.. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఓవైపు ఇదంతా జరుగుతుండగానే మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజల్‌లోనూ ఈటల భూములు ఆక్రమించారంటూ విచారణకు నలుగురు ఐఏఎస్‌ ఆఫీసర్లతో ప్రభుత్వం కమిటీ నియమించింది. ఇది అప్పట్లో పెద్ద సంచలంగా మారింది. ఈటలపై దళిత వ్యతిరేకి, దళితులను దగా చేశారనే ముద్ర వేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాటల దాడి పెంచారు. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఈటల రాజీనామా చేయాలని సవాళ్లు విసిరారు. దీంతో ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్‌ఎస్‌కు కూడా ఈటల రాజీనామా చేశారు. ఆరోపణల నేపథ్యంలో ఈటలను అరెస్ట్‌ చేసి, జైలుకు పంపుతారనే ప్రచారం కూడా జరిగింది. తర్వాత బీజేపీలో చేరిన ఈటల.. ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. దళితులు భూములు లాక్కున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నప్పటికీ...  50 వేల ఎస్సీ ఓట్లున్న హుజూరాబాద్‌లో 23,855 ఓట్ల మెజార్టీతో ఈటల గెలుపొందారు. దీన్ని బట్టి ఆయనపై వచ్చిన ఆరోపణలను జనం నమ్మలేదని అర్థమవుతోంది.