హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కోరారు. బకాయిల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం కారణంగా లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో నిధులు రాకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని, ముఖ్యంగా పరీక్షల సమయంలో ఫీజు బకాయిల పేరుతో హాల్ టికెట్లు ఆపడం, ఫలితాలు వచ్చిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓ నంబర్ 7ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు భంగం కలగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సూచించారు. యుద్ధప్రతిపాదికన నిధులు కేటాయించాలని రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
