దేశవ్యాప్త ఆందోళన, నిరసనల క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దిగొచ్చింది.చట్ట విరుద్దంగా ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయంటూ సర్ ప్రక్రియను యువత, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో ఈసీ గతంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటోంది.ఇటీవల ఫారం 6 లో రూల్స్ లో మార్పు చేసిన ఎన్నికల సంఘం.. తాజాగా సర్ ప్రక్రియలో తొలగించబడిన ఓట్లను తిరిగి చేర్చాలని, కొత్తగా18 ఏళ్లు నిండిన యువత, తొలిసారి ఓటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గల్లంతైన అర్హులైన ఓటర్లను గుర్తించి తిరిగి జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత, తొలిసారి ఓటు వేయబోయే వారిని కూడా నమోదు చేయనున్నారు.
SIRప్రక్రియలో కోట్లాది మంది అర్హులైన పౌరుల ఓటు హక్కును హరించివేసిందన్న ఆరోపణల క్రమంలో పోల్ రోల్ సవరణ పూర్తయిన ప్రాంతాలలో తొలగించిన ఓట్లు, కొత్త ఓటర్లను తక్షణమే చేర్చడానికి ఒక ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించాలని ఎన్నికల సంఘం అన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది.
SIR సమయంలో నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన పౌరులు ఓటు హక్కు కోల్పోకుండా చూడటమే ఈ స్పెషల్ ప్రొగ్రాం లక్ష్యమని ఈసీ తెలిపింది. ఓటరు నమోదు నిరంతరం జరిగే ప్రక్రియ అని స్పష్టం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు (CEOs), జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది.
ప్రస్తుత ఓటర్ల జాబితాలను SIRకు ముందు ఉన్న జాబితాలతో పోల్చి, గతంలో ఉన్నా ఇప్పుడు కనిపించని అర్హులైన ఓటర్లను గుర్తించాలని బూత్ లెవల్ అధికారులకు (BLOs) సూచించారు. గుర్తించిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను ధృవీకరించనున్నారు. అర్హులైన కొత్త, యువ ఓటర్ల నుంచి ఫారం-6 దరఖాస్తులను కూడా BLOలు సేకరించనున్నారు.
SIRలో భారీగా పేర్లు తొలగించారంటూ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంపై భారీగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలన్నీ కమిషన్ ఏకగ్రీవంగానే తీసుకుందని ఈసీ స్పష్టం చేసింది. తుది ఓటర్ల జాబితాలు వెలువడిన తర్వాతే మొత్తం మార్పులపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపింది.
ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా SIRలో తొలగించిన అర్హులైన ఓటర్లతో పాటు కొత్త ఓటర్లను కూడా జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
