న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఓటరు నమోదు ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్‌ను ఎన్నికల సంఘం తొలగించింది. సర్ కొనసాగుతున్న కాలంలో మాత్రమే ఈ డిక్లరేషన్ వర్తిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. గతంలో కొత్త దరఖాస్తుదారులు తమ లేదా తమ తల్లిదండ్రులు, తాతామామల వివరాలను పాత ఓటర్ల జాబితాతో అనుసంధానిస్తూ అదనపు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండేది.
ఇప్పుడు సర్ ముగిసిన రాష్ట్రాల్లో ఈసీనేట్ యాప్, పోర్టల్, సీఈఓ వెబ్‌సైట్ల నుంచి ఈ డిక్లరేషన్‌ను పూర్తిగా తొలగించారు. దీంతో ఆయా రాష్ట్రాల ప్రజలు 1960 నాటి నిబంధనల ప్రకారం కేవలం సాధారణ ఫారం-6ను మాత్రమే పూరిస్తే సరిపోతుంది. కానీ సర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న ప్రాంతాల్లో మాత్రం ఈ అదనపు డిక్లరేషన్ యథావిధిగా అందుబాటులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. కాగా, సెప్టెంబర్ 26న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కూడిన పూర్తి స్థాయి ఎన్నికల సంఘం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
