CM కేసీఆర్ కు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు

CM కేసీఆర్ కు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్(CEC) నోటీసులు పంపింది. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ.. దానికి వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది.

మార్చి 15న కరీంనగర్ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం కేసీఆర్. “ఈ హిందూ గాళ్లు.. బొందుగాళ్లు.. దిక్కుమాలిన దరిద్రపు గాళ్లు.. దేశంలో అగ్గిపెట్టాలే.. గత్తర లేవాలె..” అనే వ్యాఖ్యలు CM చేశారనీ… ఈ కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కమిషన్ .. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ కోరింది. సీఎం తెలుగులో మాట్లాడారు కాబట్టి.. దీనికి సంబంధించిన ట్రాన్స్ లేటెడ్ వెర్షన్ ను పంపాలని రాష్ట్ర అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే కోరి రిపోర్టు తీసుకుంది. ఈ రిపోర్టు ఆధారంగా.. ప్రాథమికంగా CEC ఓ అంచనాకు వచ్చింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించడమే అనే నిర్ణయానికి వచ్చిన సీఈసీ … సీఎం కేసీఆర్ నుంచి వివరణ కోరుతూ నోటీసులు పంపింది.

“మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరా 32ను సీఎం ఉల్లంఘించారు. కులాలు, మతాలు, భాషల మధ్య చిచ్చుపెట్టేలా ఎవరూ ప్రవర్తించకూడదు.. ఎన్నికల ప్రచారం చేయకూడదు అని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చెబుతోంది. రెండు వర్గాల మధ్య ఇప్పటికే నెలకొని ఉన్న శాంతిని డిస్టర్బ్ చేసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నట్టుగా తేలింది. కాబట్టి మీకు నోటీసులు ఇస్తున్నాం. ఏప్రిల్ 12వ తేదీ.. సాయంత్రం 5 గంటల లోగా మాకు వివరణ ఇవ్వండి. ఒకవేళ ఇవ్వకపోతే ఈసీ చర్య తీసుకుంటుంది” అని నోటీసులో వివరించారు.