ఏడు దశల్లో లోక్​సభ ఎన్నికలు ..షెడ్యూల్​ను విడుదల చేసిన ఎలక్షన్​ కమిషన్​

ఏడు దశల్లో లోక్​సభ ఎన్నికలు ..షెడ్యూల్​ను విడుదల చేసిన ఎలక్షన్​ కమిషన్​
  • రాష్ట్రంలో పోలింగ్​మే 13
  • ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్​సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు 
  • షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి 
  • వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటెయ్యొచ్చు
  • ఫేక్ న్యూస్ వ్యాప్తి, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • ప్రచారానికి పిల్లలను వాడుకోవద్దని హెచ్చరిక 

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటించనున్నారు. ఎలక్షన్ కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్​తో కలిసి శనివారం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాలుగో విడతలో మే 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్టు సీఈసీ తెలిపారు. ఏపీ, ఒడిసా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. 

2018 నుంచీ రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను భద్రతా కారణాల రీత్యా లోక్ సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ రిలీజ్ చేశామన్నారు. ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.  

ప్రచారానికి పిల్లలను వాడుకోవద్దు 

ఎన్నికల్లో నాలుగు ‘ఎం’లు (మజిల్ పవర్, మనీ పవర్, మిస్ ఇన్ఫర్మేషన్, మోడల్ కోడ్ ఉల్లంఘనలు) ప్రధాన సవాళ్లు కానున్నాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని సీఈసీ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో సరైన నడవడికతో ఉండాలని, వ్యక్తిగత దాడులకు పాల్పడరాదని పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో పిల్లలను వినియోగించరాదని, ఈ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రకటనలను వార్తల మాదిరిగా మభ్యపెడుతూ ప్రసారం లేదా ప్రచురణ చేయడాన్ని కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రకటనలను పబ్లిష్ చేసేటప్పుడు మీడియా క్లారిఫికేషన్ ఇవ్వాలన్నారు. రాజకీయ ప్రకటనలను వార్తల రూపంలో ప్రసారం చేసి మభ్యపెట్టొద్దని సూచించారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు వ్యక్తిగతంగా మెసేజ్ లు కూడా పంపుతామన్నారు. కోడ్ ఉల్లంఘనలపై నిఘా పెట్టేందుకు 2,100 మంది అడ్వైజర్లను ఎన్నికల కమిషన్ నియమించిందని తెలిపారు. 

గోయెల్ నిర్ణయాన్ని గౌరవించాలి 

ఇటీవల ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయెల్ రాజీనామా చేయడంపై అడిగిన ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు. ‘‘ఎన్నికల సంఘంలో అరుణ్ విశిష్టమైన సభ్యుడిగా ఉండేవారు. ఆయనతో పని చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ప్రతి సంస్థలోనూ ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలకు స్వేచ్ఛను ఇవ్వాలి. ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. దానిని మనం గౌరవించాల్సిందే” అని ఆయన తెలిపారు. 

మొత్తం ఓటర్లు 97.8 కోట్లు

దేశవ్యాప్తంగా మొత్తం 97.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. వీరిలో 49.72 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే 48 వేల మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. ఫస్ట్ టైం ఓటర్లు 1.82 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామని, 1.5 కోట్ల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల సంఘానికి 17 లోక్ సభ ఎన్నికలు ,16 రాష్ట్రపతి ఎన్నికలు, 400 అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన చరిత్ర ఉందన్నారు.

గత 11 స్టేట్ ఎలక్షన్లు దాదాపుగా ప్రశాంతంగా, హింసారహితంగా, రీపోలింగ్స్ లేకుండా ముగిశాయన్నారు. వచ్చే ఎన్నికలను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించామని, ఎన్నికలు పూర్తి స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  కాగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 61.5 కోట్ల మంది (67.4%) ఓటేశారు. బీజేపీ 303 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఆ తర్వాత కాంగ్రెస్ 52 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.  

నియోజకవర్గాల సంఖ్య 544 ఎందుకంటే.. 

లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​లో మొత్తం నియోజకవర్గాల సంఖ్యను 543కు బదులుగా 544గా చూపడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఈసీ సమాధానం ఇచ్చారు. ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో పోలింగ్ రెండు విడతలుగా జరగనున్నందున, దానిని రెండు నియోజకవర్గాలుగా కౌంట్ చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే..   

85 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని సీఈసీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 88.4 లక్షల మంది దివ్యాంగులు ఓటర్ లిస్టులో నమోదయ్యారని తెలిపారు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. అలాగే పోలింగ్ బూత్ ల వద్ద దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తామని, పోలింగ్ స్టేషన్ లకు ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 85 ఏండ్లు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నారన్నారు. 

ఫేక్​న్యూస్ వ్యాప్తిచేస్తే కఠిన చర్యలు 

పార్టీలు, అభ్యర్థులు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఈసీ హెచ్చరించారు. పోస్టులు పెట్టే ముందు సమాచారాన్ని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీలు, అభ్యర్థులపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేవారిపై ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 79(3)బీ ప్రకారం ప్రతి స్టేట్ లోనూ నోడల్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారని తెలిపారు. చట్ట వ్యతిరేకమైన కంటెంట్ ను ఎప్పటికప్పుడు తొలగిస్తారన్నారు. అలాగే విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ‘‘ఏదైనా ఒక అంశం ఆధారంగానే ప్రచారం చేసుకోవాలి. కానీ విద్వేషపూరిత ప్రసంగాలు, కులం లేదా మతపరమైన కామెంట్లు, వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు చేయరాదు” అని సీఈసీ స్పష్టం చేశారు. 

ఈవీఎంలు 100% సేఫ్​

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లు నూటికి నూరు శాతం సురక్షితమని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘ఈవీఎంల పనితీరుపై కోర్టులకు అనేక ఫిర్యాదులు అందాయి. కోర్టులు దాదాపుగా 40 సార్లు ఈ అంశంపై విచారణ జరిపాయి. ప్రతిసారీ అన్ని అభియోగాలను తోసిపుచ్చాయి” అని ఆయన తెలిపారు. ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని, అవి పూల్ ప్రూఫ్ గా ఉన్నాయని కోర్టులు పదేపదే తేల్చిచెప్పాయన్నారు. నేటి రోజుల్లో సాధారణ వ్యక్తులే ఎక్స్ పర్ట్ లుగా మాట్లాడుతున్నారని, ఈవీఎంలను మార్చి, ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చని ఆరోపిస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.