ఆప్​ నేతలకు కవిత ద్వారా .. రూ.100 కోట్ల ముడుపులు

ఆప్​ నేతలకు కవిత ద్వారా .. రూ.100 కోట్ల ముడుపులు
  • అందుకు బదులుగా లిక్కర్​ స్కామ్​లో భారీ దోపిడీకి స్కెచ్​
  • కేజ్రీవాల్​, మనీశ్​ సిసోడియాతో కలిసి కవిత కుట్ర చేశారు
  • సోదాల టైంలో ఆమె బంధువులు విధులకు ఆటంకం కలిగించారు
  • వెల్లడించిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​

న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ వ్యవహారంలో ఆమ్​ ఆద్మీ పార్టీ నేతలకు బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద్వారా రూ. 100 కోట్ల ముడుపులు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్  అగ్రనేతలు అరవింద్​ కేజ్రీవాల్, మనీష్  సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నారని పేర్కొంది. చెల్లించిన ముడుపులకు బదులుగా భారీ మొత్తంలో లబ్ధిపొందాలని ప్లాన్​ వేశారని తెలిపింది. హోల్ సేలర్స్ నుంచి కిక్ బ్యాక్ రూపంలో నిరంతరం అక్రమ నిధులు ఆమ్​ ఆద్మీపార్టీకి వెళ్లాయని పేర్కొంది.

ఈ మేరకు సోమవారం ఈడీ కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. లిక్కర్​ స్కామ్​ కేసులో ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు జరిపామని, అనంతరం ఆమెను అరెస్టు చేశామని తెలిపింది.  మరుసటిరోజు కవితను స్పెషల్​ కోర్టులో ప్రవేశపెట్టగా.. 7 రోజుల పాటు (ఈ నెల 23 వరకు) తమ కస్టడీకి కోర్టు అప్పగించిందని ఈడీ పేర్కొంది. కవిత ఇంట్లో సోదాలు జరుపుతున్నప్పుడు తమ విధులకు ఆమె బంధువులు, సన్నిహితులు ఆటంకం కలిగించారని వెల్లడించింది. 

రూ. 128.79 కోట్లు సీజ్  చేశాం

లిక్కర్​ స్కామ్​ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరా బాద్, చెన్నై, ముంబై సహా దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఆప్ కు చెందిన మనీశ్​ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రూ. 128.79 కోట్లు సీజ్ చేశామని స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక ప్రాసిక్యూషన్(నేరారోపణ), 5 సప్లమెంటరీ కంప్లైట్స్ ను దాఖలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపింది.