రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.11.50 లక్షలు స్వాధీనం

రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు..  రూ.11.50 లక్షలు స్వాధీనం

శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయనను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈవిషయం తెలియడంతో శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో సంజయ్ రౌత్ ఇంటివద్దకు చేరుకొని.. ఈడీకి, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముంబైలోని పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ తో పాటు ఆయన భార్య, అనుచరుల లావాదేవీలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు..

ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రెండుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందున .. ఆగస్టు 7 తర్వాతే విచారణకు వస్తానని రౌత్ స్పష్టం చేశారు. దీంతో స్వయంగా ఈడీ అధికారులే ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రౌత్ ఇంట్లో సోదాలు చేశారు. సోదాల్లో రూ.11.50 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  సోదాల అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

చనిపోయినా ఎవరికీ తలొగ్గను

ఈనేపథ్యంలో  సంజయ్ రౌత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేనను వీడను. చనిపోయినా ఎవరికీ తలొగ్గను. రాజకీయ కుట్రలో భాగంగానే నాపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఎలాంటి కుంభకోణంతోనూ నాకు సంబంధం లేదు. బాలా సాహెబ్ ఎలా పోరాటం చేయాలో నేర్పించారు’’ అని రౌత్ పేర్కొన్నారు. కాగా, సంజయ్‌ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని శివసేన చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. తమ పార్టీని నాశనం చేసే కుట్రలో భాగంగానే ఈడీ దాడులు చేస్తోందని ఆరోపించారు.