రామచంద్ర పిళ్లై కవితకు బినామీ : ఈడీ

రామచంద్ర పిళ్లై కవితకు బినామీ : ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లై రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 17 పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ రూపొందించింది.  పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీగా ఉన్నారని తెలిపింది. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై పనిచేశారని, తాను కవిత ప్రతినిధినని పిళ్లై  పలుమార్లు స్టేట్మెంట్ ఇచ్చారని రిమాండ్ లో పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో పిళ్లై కీలకపాత్ర పోషించారని,  ఇండో స్పిరిట్ స్థాపనలో ఆయనదే కీలక పాత్ర అని ఈడీ పేర్కొంది. 

ఏడు రోజుల కస్టడీకి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లైని.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అదికారులు. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని.. ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున  కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. అధికారుల పిటీషన్ తో ఏకీభవించిన కోర్టు.. అరుణ్ రామచంద్ర పిళ్లైని.. ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది.

దీంతో ఆయన మార్చి 13వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కస్టడీలో ఉన్న సమయంలో తన తల్లితో ఫోన్ లో మాట్లాడేందుకు అనుతించింది కోర్టు. అదే విధంగా ప్రతి రోజూ తన భార్య, బావమరిదిని కలుసుకునేందుకు సైతం అంగీకరించింది న్యాయస్థానం. అనారోగ్యంతో బాధపడుతున్న పిళ్లైకు.. హైపో థెరాయిడ్ మందులు, వెన్ను నొప్పికి బెల్ట్ ను కస్టడీలోనూ ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది కోర్టు. కెమెరా ముందు మాత్రమే ప్రశ్నించాలని ఈడీ అధికారులను ఆదేశించింది కోర్టు.